చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 19: బాలుడి కిడ్నాప్ ను 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ రాజీవ్ గాంధీనగర్‌లో మహ్మద్ నసీర్ కుటుంబం నివాసముంటుంది. ఈ నెల 18న పని నిమిత్తం ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా, ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నసీర్ కుమారుడు మహ్మద్ అహ్మద్(3) అపహరణ గురయ్యాడు. రాజీవ్‌గాంధీనగర్ బస్తీలోనే నివసించే ఫాతిమాబేగం(38) అనే మహిళతో బాబు కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. ఇదిలా ఉండగా, బహదూర్‌పురా హసన్‌నగర్‌కు చెందిన సయ్యదా గౌసియా బేగం(39) తో ఫాతిమాకు పరిచయం ఉంది. అయితే సయ్యదా గౌసియా బేగానికి ఒక కూతురు ఉంది. బాబు లేకపోవడంతో తనకు ఓ కొడుకు ఉంటే బాగుండేది అంటూ ఫాతిమా దగ్గర మొరపెట్టుకునేది. ఈ క్రమంలో.. ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారి అహ్మద్‌ని ఫాతిమా, గౌసి యా బేగానికి గుట్టు చప్పుడు కాకుండా అప్పగించింది. ఇద్దరూ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలుడు కనిపించకపోవడంతో 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా, ఫాతిమాబేగం, గౌసియా బేగం కథ వెలుగులోకి వచ్చింది.