సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): మీ వద్దనున్న భారీ వాహనాలను నడిపించేందుకు డ్రైవర్లను ఉద్యోగంలో పెట్టుకుంటున్నారా.. ముందుగా అతడి వద్ద సరైన లైసెన్స్ ఉందా.. లేదా.. అన్న విషయాన్ని సరిచూసుకోండి. వాహనానికి అనుగుణంగా లైసెన్స్ ఉంటేనే డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వండి. ఇవేవి పట్టించుకోకుండా ఉద్యోగం ఇస్తే అది చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే అది చాలా ప్రమాదమని సూచిస్తున్నారు.
వారి నిర్లక్ష్యం వల్ల ఇతరులకు ప్రాణహాని కలిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ద్విచక్ర వాహనాలు, కార్లు ఇచ్చిన వాహన యజమానులపై సైబరాబాద్‌లో కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని భారీ వాహనాల డ్రైవర్‌గా ఉద్యోగాల్లో పెట్టుకుని, వారి వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరినీ విడిచిపెట్టమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం. విజయ్‌కుమార్ స్పష్టం చేస్తున్నారు. దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ సంఘటన నిదర్శనమన్నారు.
ఈ ఘటనలో శ్రీకాంత్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం మత్తులో వాటర్ ట్యాంకర్‌ను నడిపి చేసిన ప్రమాదంలో మహిళ మరణించింది. అయితే, వాటర్ ట్యాంకర్ సూపర్వైజర్ సంతోష్‌కుమార్ పోలీసులను తప్పుదారి పట్టించేందుకు శ్రీకాంత్ మద్యం మత్తులో ఉన్న విషయాన్ని దాచిపెట్టి, పిట్ల నరసింహులు వాటర్ ట్యాంకర్‌ను నడిపించాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. అతడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. విచారణలో వారి డ్రామా బయటపడటంతో ముగ్గురిపై దుండిగల్ పోలీసులు 304 పార్ట్-2, 201, 202, 203, 205, 109, 120(బి), సెక్షన్ 184, 185, 187, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.