సెల్‌ఫోన్…డ్రైవింగ్ లైసెన్స్… ల్యాప్‌టాప్ ఇలా ఏవైనా వస్తువులు పోతే బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగేవారు. కానీ ఇప్పుడు.. ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ.. ఇప్పుడు మిస్సింగ్ సర్టిఫికెట్ల జారీని సులభతరం చేసింది. పోలీస్‌స్టేషన్‌కు రాకుండా బాధితుడు ‘హాక్ ఐ’ ద్వారా తన సెల్‌ఫోన్ నుంచి దరఖాస్తు చేస్తే చాలు.. విచారించి..72 గంటల్లో అతడికి మిస్సింగ్ సర్టిఫికెట్ అందేలా వ్యవస్థను రూపొందించారు.
సర్టిఫికెట్, కార్డు, గుర్తింపు కార్డులు తదితర వస్తువులు పోగొట్టుకోవడం, కన్పించకుండా పోయిన సందర్భాల్లో డూప్లికేట్ తీసుకోవాలంటే కొన్ని సంస్థలు తప్పనిసరిగా పోలీసుల నుంచి ధ్రువీకరణ పత్రం ఉండాలనే నిబంధన పెడుతాయి. అలాంటి సందర్భాల్లో మిస్సింగ్ సర్టిఫికెట్ ఎంతో అవసరం ఉంటుంది. గతంలో మీ సేవలో దరఖాస్తు చేస్తే..విచారణ అనంతరం వారం తర్వాత ఈ సర్టిఫికెట్‌ను ఇచ్చేవారు. ప్రస్తుతం హాక్ ఐ డౌన్లోడ్ చేసుకొని.. అందులోని లాస్ట్ రిపోర్టు విభాగంలోకి వెళ్లి…దరఖాస్తు చేస్తే సరిపోతుంది. మీ అర్జీని పరిశీలించి.. మూడురోజుల్లో ఈ మెయిల్‌కే మిస్సింగ్ సర్టిఫికెట్‌ను పంపిస్తారు.
ప్రతి ఫోన్లో ‘హాక్ఐ’ తప్పనిసరిగా ఉండాల్సిన యాప్. ఏదైనా వస్తువు(మొత్తం 27 రకాల వస్తువులు) పోయినప్పుడు అందులోని ‘లాస్ట్ రిపోర్టు’ ద్వారా మిస్సింగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. 2015లో ‘లాస్ట్ రిపోర్టు’ మొబైల్ యాప్‌ను సిటీ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. అన్ని సేవలు ఒకే చోట నుంచే అందించాలనే ఉద్దేశంతో ఈ అప్లికేషన్‌ను ‘హాక్ ఐ’లో కలిపేశారు.
ఆధార్‌కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, చెక్‌బుక్, బాండ్ సర్టిఫికెట్, కెమెరా, సెల్‌ఫోన్, కంప్యూటర్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, ఐపాడ్, ల్యాప్‌టాప్, మార్క్ మెమో, పాన్‌కార్డు, పోస్టల్ పాస్‌బుక్, షేర్ సర్టిఫికెట్, సిమ్ కార్డు, ట్యాబ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, వెహికిల్ ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు, వాహన ఆర్సీ, ఓటర్ ఐడీ కార్డు… వంటివి పోతే.. ‘లాస్ట్ రిపోర్ట్’ ద్వారా మిస్సింగ్ సర్టిఫికెట్లు పొందవచ్చు.