సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : మెడికల్ ఏజెన్సీలు, షాపుల యాజమాన్యాలకు వణుకు పుట్టిస్తుంది హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్‌న్యూ). నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నది. ముమ్మరంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని., లేదంటే చర్యలు తీసుకునే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు అడపా… దడఫా తనిఖీలు చేసిన అధికారులు ఇటీవల మెడిసిన్ మాటున డ్రగ్స్ సంబంధిత ట్యాబెట్లు అక్రమ పద్ధతిలో విక్రయిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో నిఘాను మరింత పటిష్టం చేసింది. డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో అణిచివేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. దగ్గు కోసం ఉపయోగించే సిరప్, డిఫ్రెషన్లో ఉన్న వారికి అందించే ట్యాబ్లెట్లు అక్రమ పద్ధతిలో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న 15 మందిని ఇప్పటికే అరెస్టు చేసిన హెచ్‌న్యూ వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్, నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపింది.
మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలకు హెచ్1, హెచ్, ఎక్స్ విభాగాలుగా చేసి మందుల విక్రయాలకు లైసెన్స్‌లు జారీ అవుతాయి. ఎక్కువగా హెచ్1లో 20, 21 కింద రిటైల్ దుకాణాలకు, 20బి, 21బి కింద హోల్ సెల్ దుకాణాలకు అనుమతులిస్తారు. వీరు 530 రకాలైన మందులు, వివిధ రకాలైన పదార్థాల కలియికలతో తయారు చేసినవి విక్రయిస్తారు. అందులో 10 మాత్రమే నార్కొటిక్ సంబంధించిన పదార్థాల కలియికతో తయారు చేసినవి ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ ట్యాబ్లెట్లు హైదరాబాద్‌లో అక్రమ పద్ధతిలో అనవసరమైన వారి చేతుల్లోకి వెళ్తున్నాయి. మానసిక స్థితి ఆందోళనకరంగా ఉన్నవారికి, డిఫ్రెషన్లో ఉన్న వారికి వైద్యవృత్తిలో ఎండీ అర్హత ఉన్న వైద్యులు, మానసిక నిపుణుల సూచనలతోనే ఇలాంటి ట్యాబ్లెట్లు రోగులకు అందిస్తారు. అయితే ఈ ట్యాబ్లెట్ల వాడకం చాలా తక్కువగా అవసరముంటుంది. తయారీ దారు నుంచి డిస్ట్రిబ్యూటర్, సరఫరాదారు, మెడికల్ దుకాణానికి వచ్చే వరకు ప్రతి మందు యొక్క వివరాలు నమోదు కావాలి. నార్కొటిక్ సంబంధించిన పదార్థాల కలయికతో తయారైన మందులు ఎన్ని ఉత్పత్తి చేశారు, ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఎవరికి వాటిని అందించారు అనేది పారదర్శకంగా ఉండాలి. కాని అలాంటి పరిస్థితి లేదని దర్యాప్తులో వెల్లడైంది. హెచ్‌న్యూ అరెస్ట్ చేసిన వారిలో ఏజెన్సీ నిర్వాహకులు, మెడికల్ దుకాణదారులు ఉన్నారు. వారి వద్ద భారీ ఎత్తున మందులు దొరికాయి. కానీ అవి ఎక్కడ కూడా రికార్డుల్లో కన్పించలేదని అధికారులు వెల్లడించారు.
నార్కొటిక్ సంబంధించిన పదార్థాలతో తయారైన మందులను దుకాణాలలో విరివిగా విక్రయిస్తున్నారు. వీటిని అలవాటు చేసి, ఈ మాఫియా తమ డ్రగ్స్‌కు డిమాండ్‌ను పెంచుకుంటుంది. దీనికి అలవాటు పడిన వారికి లైంగిక కోరికలు తీరిస్తేనే సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల నుంచి కొన్ని మెడికల్ ఏజెన్సీలు ఇలాంటి మత్తు పదార్థాలు విక్రయించేందుకు ఒక మాఫియాగా తయారయ్యారు. ఈ నార్కొటిక్ పదార్థాలతో తయారైన ట్యాబ్లెట్ 30 రోజులపాటు రోజూ వాడితే, అలాంటి వారు దీనికి అలవాటు పడి ప్రతిరోజు కావాలంటారు. ఆ తరువాత ఒకటి సరిపోదు, రెండు అవసరమవుతాయి. ఇలా దీనికి అలవాటు పడినవారు తక్కువ ధరకు ట్యాబ్లెట్ వస్తుందని కొనిపెట్టుకొని వాడేస్తున్నారు. ఈ డ్రగ్ వాడిన వారు మత్తులో ఉంటూ నిద్రలోకి జారుకుంటారు. వారి నాడీ వ్యవస్థపై ఈ మందులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ మందులు వాడిన వారు ఎవరైనా రోడ్లపైకి వచ్చారంటే వారి నుంచి ఇతరులకు ప్రమాదం పొంచి ఉంటుంది.
మెడికల్ దుకాణాల మాటున సాగుతున్న ఈ అక్రమ దందాపై ఎవరూ అంతగా ఫోకస్ పెట్టరనే ధీమాలో ఈ మాఫియా దందా సాగిస్తున్నది. డ్రగ్ కంట్రోల్ అధికారులు వచ్చినా.. రికార్డులు చూసుకొని పోతారనే భావనలో ఉన్నారు. అయితే వీరు నడుపుతున్న దందాను పసిగట్టిన హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్ రమేశ్‌రెడ్డి బృందం లోతైన దర్యాప్తు జరిపింది. ఇలాంటి డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయించే వారిపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), డీఆర్ఐ(డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), ఇతర రాష్ర్టాలలో ఎలాంటి కేసులు పెట్టారు, ఎలాంటి శిక్షలు విధించారనే దానిపై లోతుగా స్టడీ చేశారు. ఆ తరువాత డ్రగ్ కంట్రోల్ అధికారులతో చర్చించి, హైదరాబాద్‌లో కొనసాగుతున్న మత్తు మాఫియాపై దాడులు జరిపారు. హెచ్‌న్యూ దాడులలో భారీ ఎత్తున్న అక్రమంగా విక్రయానికి నార్కొటిక్ పదార్థాలతో తయారైన 1160 సిరప్ బాటిల్స్, 1,52,400 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.