నేరేడ్మెట్, మే 2:నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మిస్టరీ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని అద్దె ఇంట్లోని కిచెన్ ప్లాట్‌ఫాం కింద దాచిపెట్టి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జేకే కాలనీకి చెందిన గవ్వల మల్లేష్ (47) ఫ్లంబర్‌గా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు.
హెచ్‌బీ కాలనీలోని లేబర్ అడ్డాలో పరిచయమైన కంచి వెంకటరాములు (47)తో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ తరచూ కలిసి మద్యం సేవించేవారు. గత ఏడాది డిసెంబర్ 15న పని దొరకకపోవడంతో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మల్లేష్ ఇంటికి వెళ్లి మళ్లీ మద్యం తాగారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలపై వెంకటరాములు అవమానకరంగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంగా మల్లేష్ చెక్క కర్రతో వెంకటరములుపై దాడి చేయగా తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య అనంతరం మృతదేహాన్ని దాచిపెట్టేందుకు మల్లేష్ చేతులు, కాళ్లు, మెడకు తాడు కట్టి ఇంట్లోని ప్లాట్‌ఫాం కింద ఉంచి ఇటుకలతో మూసివేశాడు.
అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఏప్రిల్ 17న ఇంటి యజమాని తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లగా దుర్వాసన వచ్చింది. కిచెన్ ఫ్లాట్‌ఫాంను తొలగించి చూడగా కుళ్లిపోయిన మృతదేహం అవశేషాలు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు మల్లేష్‌ను మే 1న జూబ్లీ బస్‌స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును డీసీపీ శ్రీధర్, ఏసీపీ వి.యాదగిరిరెడ్డి పర్యవేక్షణలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ పి.సందీప్‌కుమార్, డీఐ శ్రీనివాస్, ఎస్సైలు చంద్రశేఖర్, సాయి అవినాష్, సిబ్బంవది ఛేదించారు.