బంజారాహిల్స్, మార్చి 19: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో అరుదైన ఇంపెల్లా బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేర్ ఆస్పత్రి కార్డియాక్ సర్జన్లు డా.జి.రామ సుబ్రమణ్యం, డా.వి.సూర్యప్రకాశ్ రావు వివరాలను వెల్లడించారు. తమిళనాడు కడూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణ(70) అనే వ్యక్తి కొంత కాలంగా గుండె సంబంధిత జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పలుచోట్ల అడ్డంకులు ఏర్పడిన ఈ స్థితిలో స్టెంట్స్ వేయడానికి సాధ్యం కాదని వైద్యులు తేల్చారు. దీంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి వచ్చిన వెంకటకృష్ణకు ఇటీవల అత్యంత సంక్లిష్టమైన ఇంపెల్లా బైపాస్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బైపాస్ సర్జరీలకు విభిన్నంగా మరింత కచ్ఛితమైన ఫలితాలు ఇచ్చేలా ఈ ఇంపెల్లా సీపీ సర్జరీని ఆగ్నేయాసియాలోనే తొలిసారిగా తమ ఆస్పత్రిలో నిర్వహించామని డా.రామ సుబ్రమణ్యం తెలిపారు.