సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తలేరా.. అయితే ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇన్నాళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేవారు. కానీ ఇప్పుడు ఇతర ఉల్లంఘనలపై కూడా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఫలితంగా కేసు తీవ్రతను బట్టి.. జైలు శిక్ష కూడా పడవచ్చని చెబుతున్నారు. అతివేగం, మైనర్ డ్రైవింగ్, రేసింగ్‌లు, స్టంట్స్, లైసెన్స్‌లు, నంబర్ప్లేట్లు లేకుండా ఇలా.. వివిధ ఉల్లంఘనలపై ఎక్కువగా దృష్టి పెట్టి..కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మూడేండ్లుగా..
డ్రంక్ అండ్ డ్రైవ్ మినహా మిగతా ఉల్లంఘనలపై మూడేండ్లుగా కోర్టులో చార్జిషీట్లు వేయడం లేదు. కరోనా, తదితర కారణాల వల్ల ఈ ప్రక్రియ చేపట్టలేదు. ఇటీవల పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని వాహనదారులకు డిస్కౌంట్‌తో 45 రోజుల సమయం సైతం ఇవ్వడంతో అనేక మంది జరిమానాలు చెల్లించారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా.. వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా..కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇందులోభాగంగానే ఉల్లంఘనలదారులపై చార్జిషీట్లు వేస్తున్నారు.
తీవ్రతను బట్టి..
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై చార్జిషీట్ దాఖలు చేయడమనేది నిరంతర ప్రక్రియ. అయితే తాజాగా మిగతా ఉల్లంఘనలపై కూడా ఈ నెల నుంచి చార్జిషీట్లు వేయడం ప్రారంభించారు ట్రాఫిక్ పోలీసులు. మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ , నంబర్ ప్లేట్ లేకుండా నడిపించే వాహనదారులపై చార్జిషీట్లు వేస్తున్నారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జైలు శిక్షలు పడడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంటే.. ఇతర ఉల్లంఘనల్లో కూడా వాటి తీవ్రతను బట్టి జైలు శిక్షలు పడడం ఖాయమని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకసారి కోర్టులో చార్జిషీట్ దాఖలై శిక్షలు పడితే.. వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కుతుందని, యువత తమ బంగారు భవిష్యత్‌ను పోగొట్టుకోవాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు.