అల్లాపూర్, ఏప్రిల్ 23: ఖైత్లాపూర్ నుంచి బ్యాంకుకాలనీ అయ్యప్పసొసైటీ మధ్యలో నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది.అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు హైకోర్టు తీర్పుతో మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండు సంవత్సరాల కిందట మొదలైన ఆర్వోబీ పనులు గతేడాది డిసెంబర్ నాటికే 90 శాతం పనులు పూర్తి చేసుకొని తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఖైత్లాపూర్ వద్ద ఐదుగురు భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రెండునెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిందని బల్దియా ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
మరో రెండు నెలల్లో ..
కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వైపునకు సులువైన రాకపోకల కోసం రూ.83 కోట్ల వ్యయంతో ఖైత్లాపూర్ ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 675 మీటర్ల పొడువు 20మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఆర్వోబీ నిర్మాణ పనులు రెండేండ్ల కిందట ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తిచేసేందుకు పరుగులు పెట్టించారు. గతేడాది డిసెంబర్ నాటికే పనులు 90 శాతం పూర్తయ్యాయి. కేవలం ఖైత్లాపూర్ వైపు ర్యాంపు అనుసంధానం చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఖైత్లాపూర్‌లో ఐదుగురు భూ యజమానులు తమకు సంబంధించిన 1300 చదరపు గజాల స్థలం విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 15 రోజుల్లోగా భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని తుది తీర్పునిచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమస్య పరిష్కారమై ఆర్వోబీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో మరో రెండు నెలల్లో నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు.
తీరనున్న ట్రాఫిక్ సమస్య
ఐటీ కారిడార్‌ను కలిపే ఖైత్లాపూర్ నుంచి అయ్యప్పసొసైటీ వరకు నిర్మిస్తున్న ఆర్వోబీ అందుబాటులోకి వస్తే కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి అదనపు మార్గం వస్తుంది. జేఎన్టీయూ, మలేషియాటౌన్ షిప్ జంక్షన్లు, హైటెక్‌సిటీ బ్రిడ్జి, సైబర్‌టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. సనత్‌నగర్, బాలానగర్, సిక్రింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు మాసాపేట వద్ద ఖైత్లాపూర్ ఆర్వోబీ మీదుగా మాదాపూర్ ప్రధాన రహదారికి వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి మూడు కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది.