సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : గత కొన్నేళ్లుగా గ్రేటర్‌ను వర్షాకాలం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. నాలాల ఆక్రమణలు, మత్తడిపై నిర్మాణాలు చేపట్టడంతో చాలా చోట్ల చెరువు కట్ట కింద ఉండే కాలనీలతో పాటు వెనుక ఉన్న కాలనీలు వర్షాకాలం వచ్చిందంటే నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వరద సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..
వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతమున్న నాలాలను అభివృద్ధి చేయడంతో పాటు సమాంతరంగా ఉన్న వీధుల్లోంచి మరో మూడు, నాలుగు భూగర్భ వరద నీటి కాలువలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ప్రభుత్వం ఫేజ్-1 కింద రూ.985.45కోట్లు కేటాయించింది.
వచ్చే నెలాఖరు నాటికల్లా పూర్తి
చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలాల విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతానికి ఎస్ఎన్డీపీ విభాగం అధికారులు నడుం బిగించారు. అందుకు ఎన్ఎన్డీపీ కింద 30 ఇంజినీరింగ్ డివిజన్లు ఏర్పాటయ్యాయి. వాటి పరిధిలో 15 ఫ్యాకేజీలుగా 37 పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీతో పాటు చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లోనూ ఆయా పనులను వచ్చే నెలాఖరు నాటికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో జోనల్ స్థాయిలో సీనియర్ ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 చోట్ల, శివారు మున్సిపాలిటీల పరిధిలో 13 చోట్లలో 11 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
నిపుణులతో నాణ్యత పరీక్షలు
నాలాల అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంజినీరింగ్ కళాశాలల నిపుణులతో పరీక్ష చేయిస్తున్నారు. ఇందుకు 15 ఫ్యాకేజీలను ఆరు భాగాలుగా విభజించి, వాటి నాణ్యత పరీక్షలను నిపుణులకు అప్పగించారు. పనులు జరుగుతున్న సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.