బంజారాహిల్స్,ఏప్రిల్ 11: ఓటర్ జాబితాలో తప్పుల సవరణతో పాటు బోగస్ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓటర్ జాబితాల పరిశీలన కోసం నియమించిన బూత్ లెవల్ అధికారులు, సూపర్వైజర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్ -18 డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని జీహెచ్ఎంసీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంసీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటర్ జాబితాలో తప్పొప్పుల సవరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
నియోజవకర్గంలోని 2 లక్షల 85 వేల మంది ఓటర్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలని సూచించారు. ఓటర్ జాబితాలో ఒకరి ఫొటోతో ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు. నియోజకవర్గంలో సుమారు 10వేల వరకు ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఆయా ఫొటోలను పరిశీలించేందుకు ఇంటింటికీ వెళ్లాలని ఆదేశించారు. 245 మంది బీఎల్వోలు ఆయా బూత్‌లలో తిరిగి పరిశీలన చేపట్టాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చిరునామా మార్పు, తప్పొప్పుల సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 20లోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 31మంది సూపర్వైజర్లతో పాటు నలుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎలక్షన్ ఆపరేటర్ శ్రీనివాస్, ఏఎంసీ శ్రీనివాస్‌గౌడ్, సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.