ఐల్యాండ్ల నిర్మాణం పూర్తికానున్న పనులు
బాలానగర్, మార్చి 20 : బాలానగర్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రూ. 387 కోట్ల వ్యయంతో స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (ఎస్ఆర్డీపీ )భాగంగా నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన పరిసర ప్రాంతాలలో ఐల్యాండ్ నిర్మాణానికి ఆవశ్యకత ఏర్పడింది. బాలానగర్ ఫ్లైఓవర్ కింద నిత్యం వాహనాల రద్దీ నెలకొంటున్న తరుణంలో పాదచారులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పాదచారుల సమస్యలను గుర్తించిన సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే కృష్ణారావు ఐల్యాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చారు.
ఇందులో భాగంగా బాలానగర్ టీ జంక్షన్ (ఫతేనగర్ వెళ్లే సర్కిల్), బాలానగర్, నర్సాపూర్ చౌరస్తాలలో ఐల్యాండ్ల నిర్మాణం చేపట్టారు. పనులు త్వరలో పూర్తి కానున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై పాదచారులు రోడ్డు దాటడం కోసం వేచి ఉండే స్థలాన్ని ఐల్యాండ్ అంటారు. ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పాదచారులు రోడ్డు దాటడం ఇబ్బందికరంగా మారింది. అయితే పాదచారులు రోడ్డు దాటేక్రమంలో వేచి ఉండేందుకు సరైన స్థలంలేక రహదారిపైనే నిలబడాల్సి వస్తుండేది. ఈ క్రమంలోనే బాలానగర్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలలో ఐల్యాండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఐల్యాండ్తో పాటు నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్బూత్ నిర్మాణ పనులు సైతం చురుకుగా కొనసాగుతున్నాయి.