అంబర్‌పేట, మార్చి 14 : ‘మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా?.. ఉంటే వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో, నాలాల్లో వేయొద్దు…వాటిని మీ ఇంటి వద్ద నుంచే జీహెచ్ఎంసీ సేకరిస్తుంది. నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలు మీ ఇంటి దగ్గరకు వస్తాయి..వాటిలో వేయండి’ అంటూ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇటీవల ప్రజలకు విషయాన్ని చెప్పారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. డీసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ డా.జ్యోతిబాయి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో ఉన్న ఆరు డివిజన్లలో పని చేస్తున్న పారిశుధ్య విభాగం సూపర్వైజర్లు ఆయా డివిజన్ల ప్రజలకు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి పనికిరాని వస్తువులు ఉన్నా తమకు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. పాడైన రిఫ్రిజిరేటర్, సోఫాసెట్, డైనింగ్ టేబుల్, కుర్చీలు, ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, ఇతర ఏ వస్తువులు ఉన్నా తమకు సమాచారం ఇస్తే తామే వచ్చి వాటిని సేకరిస్తామని ప్రజలకు విన్నవిస్తున్నారు. స్వచ్ఛ ఆటోల్లో వాటిని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట సాయిమధురానగర్లో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, మెత్తలు, దుస్తులు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటిని సేకరించారు. ఎస్ఎఫ్ఏలు హరినాథ్, ఎం. నర్సింహ, జి. కస్పారెడ్డి, ఎం. అశోక్, ఆదిల్, వేణుగోపాల్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి
ప్రజలు ఇండ్లలో పనికిరాని వస్తువులు ఉంటే తమకు అప్పగించాలి. ఎక్కడపడితే అక్కడ వేయొద్దు. పనికిరాని వస్తువులను రోడ్లపై పడేయకుండా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వండి.
– డా. జ్యోతిబాయి