మేడ్చల్ రూరల్, మార్చి 13 : మేడ్చల్ పట్టణంలో కొలువైన దాక్షాయని రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 4.30 గంటల సయయంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. మేడ్చల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి, స్వామిని దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి.
స్వామిని దర్శించుకున్న మంత్రి ..
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ధాత్రిక కాశీనాథ్ ఆధ్వర్యంలో నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. దేవాదాయ శాఖ నుంచి కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. అన్నదాన శిబిరాన్ని సందర్శించి, భక్తులకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు మహేశ్, దేవరాజ్, గణేశ్, స్వామియాదవ్, మణికంఠగౌడ్, శివకుమార్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ యాదవ్, నాయకులు భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, పాల్గొన్నారు.
డబుల్ ఇండ్లు కేటాయించాలని మంత్రికి వినతి
కేశ్వాపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని సర్పంచ్ బుడిగె ఇస్తారి కోరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు అంబేద్కర్ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, కృష్ణ, ఎల్లారెడ్డి, విజయ్‌కుమార్, ఉపేందర్‌గౌడ్, ము త్యాలు, శంకర్, నాగేశ్, తదితరులు పాల్గొన్నారు.