అబిడ్స్, ఫిబ్రవరి 26 : పోలియో రహిత సమాజం కోసం ఐదేండ్లలోపు పిల్లలకు ‘ పల్స్ పోలియో ’కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు వేస్తున్నారు. ఆదివారం చుక్కలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలియో చుక్కలు వేయించాలని విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కలను వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బస్తీ దవాఖానలు, యూపీహెచ్‌సీలు, బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో చుక్కలు వేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో లక్ష వరకు ఐదేండ్ల లోపు చిన్నారులు ఉంటారని, వారందరూ పోలియో చుక్కలు వేసుకునేందుకు వైద్యాధికారులు ప్రచారాన్ని చేపట్టారు. ఆదివారం అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనుండగా.. ఎవరైనా వేసుకోక పోతే వారి నివాసాలకు సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం ఏడు గంటల నుంచి..
చుక్కల పంపిణీని ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు వేసేందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని 234 బూత్‌లలో చుక్కలు వేయనున్నారు. ఆయా బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 936 బృందాలను రంగంలోకి దింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నియోకవర్గం మొత్తంలో మొత్తం 35,417 మంది పిల్లలు ఉన్నట్లు పన్నిపురా క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లో వారి నివాసాలలో సిబ్బంది వేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
పల్స్ పోలియో సందర్భంగా చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ కార్యాలయం పరిధిలో 35, 417 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలున్నారు. 234 బూత్‌ల ద్వారా 936 సిబ్బంది రంగంలోకి దిగి పల్స్ పోలియో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని వారి నివాసాలకు సోమ, మంగళ వారాలలో సిబ్బంది నేరుగా వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఐదేండ్లలోపు వారందరికీ పోలియో చుక్కలను వేయించాలి.
– డాక్టర్ మల్లీశ్వరి, పన్నిపురా క్లస్లర్ ఎస్పీహెచ్ఓ