కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 22 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో రూ.32.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఫ్రెండ్స్ కాలనీలో వాటర్ వర్క్స్ ఆఫీస్ దగ్గర రూ.8లక్షలతో, హస్మత్‌పేట షేర్ గల్లీలో రూ.7.20 లక్షలతో, ప్రగతికాలనీ అంజయ్యనగర్‌లో రూ.12 లక్షలతో, అంజయ్యనగర్ ధోబీఘాట్‌లో రూ.5.30 లక్షలతో డ్రైనేజీ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో ఆదర్శ పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ నేతలు మత విద్వేశాలను రెచ్చగొడుతూ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరించినట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
చెరువులో కబ్జా నిరూపిస్తారా..?
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బోయిన్పల్లి చెరువు కబ్జా జరిగినట్లు బీజేపీ నేతలు నిరూపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. మంగళవారం కార్పొరేటర్, అధికారులతో కలిసి బోయిన్పల్లి చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బీజేపీ నేతలు చెరువు విస్తీర్ణంపై అసత్య ఆరోపణలు చేశారని.. గత ఏడేండ్లలో చెరువు కబ్జా అయినట్లు నిరూపించినా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కబ్జా చేసినా చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత ఇరువై ఏండ్ల కిందట ఇల్లు కట్టుకున్నవారే ఉంటున్నారన్న విషయం తెలుసుకోవాలన్నారు. మురికి కూపంగా ఉన్న బోయిన్పల్లి చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తైతే చెరువు పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.