సైదాబాద్, నవంబర్ 22 : సరిగాలేని రోడ్లు, తరుచూ డ్రైనేజీ మురుగునీరు పొంగిపోర్లుతుండటంతో అనేక కష్టాలు పడ్డ కాలనీవాసుల్లో ఆనందం వ్యక్తమౌతున్నది. డ్రైనేజీ మురుగునీరు పొంగి ఇండ్ల ఎదుట వరుదలాగా ప్రవాహిస్తున్నప్పుడల్లా కాలనీవాసులంతా దుర్గంధం, దుర్వాసనతో ఇబ్బందులు పడేవారు. రోడ్లు సక్కగా లేకపోవటంతో వాహనదారులు, పాదచారులు పడ్డ ఇబ్బందులన్ని నేడు తొలగిపోయాయి. దీంతో ఆ కాలనీవాసులందరూ స్థానికంగా జరిగిన అభివృద్ధిని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గంలోని అక్బర్‌బాగ్ డివిజన్లోని ఆనంద్‌నగర్ కాలనీ ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉండేది. నేడు అందమైన రోడ్లు, ఆధునీకరించిన డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలతో పలు కాలనీలకు ఆదర్శంగా మారింది. పురాతన డ్రైనేజీ పైపులైన్‌ను తొలగించి 12 ఇంచుల డయా పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. అందరికీ కనెక్షన్లు ఇచ్చిన తదుపరి లక్షలాది రూపాయలను వెచ్చించి సీసీ రోడ్లను వేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా స్థానికులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను పరిశీలించారు. కాలనీ సమస్యలను కార్పొరేటర్ మినాజుద్దీన్, ఎమ్మెల్యే బలాల ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించటంతో కాలనీవాసులందరూ ఆనందనోత్సాహంతో ఉన్నారు.
మున్ముందు మరిన్ని సౌకర్యాలు వస్తాయి..
తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థకు ఆధునీకరణ పనులు పూర్తిగానే సీసీ రోడ్లు వేశారు. ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్న తమకు కార్పొరేటర్ మినాజుద్దీన్, ఎమ్మెల్యే బలాల ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించారు. ఆనంద్‌నగర్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి గురించి వారి దృష్టికి తీసుకెళ్లాం. సామాజిక భవనంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే వారు పరిష్కరిస్తారనే నమ్మకంతో ఉన్నాం.
– ఎం. మోహన్ రాజ్, అధ్యక్షుడు,ఆనంద్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్
కాలనీల్లో రోడ్ల అభివృద్ధిపై శ్రద్ధ
అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆనంద్ నగర్ కాలనీలో రూ.10 .60 లక్షలతో సీసీ రోడ్లు వేశాం. మిగతా కాలనీల్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. శిథిలావస్థకు చేరిన రోడ్లను గుర్తించి తగుచర్యలు తీసుకుంటున్నాం. కాలనీల్లో అన్ని ప్రాంతాల రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
– వెంకన్న , ఏఈ, మలక్‌పేట సర్కిల్
ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు
ఆనంద్ నగర్ కాలనీలో నెలకొన్న ఇతర సమస్యలపై ఎమ్మెల్యే బలాల ఆరా తీశారు. కాలనీవాసులు ఇప్పటికే కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై ఆయన దృష్టికి తీసుకెళ్లటంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థను ఆధునీకరించటంతో కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలు పరిష్కరించటంతో వారు ఇతర సమస్యలపై దృష్టి సారించి కాలనీవాసులు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు.