సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్‌న్యూ) చేస్తున్న కృషికి ఫలితాలొస్తున్నాయి. డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు చేపట్టిన గోవా ఆపరేషన్‌తో డ్రగ్ మాఫియాలో భయం పుట్టింది. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారు. డ్రగ్స్ తీసుకునే వారితో పాటు అమ్మేవారిని, కొనేవారిని కూడా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు.. నేరగాళ్లను కటకటాల్లోకి పంపించారు.
మూలాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నేరగాళ్లను పట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు డ్రగ్ సరఫరా చేస్తున్న మాఫియా కింగ్ పిన్లు గోవాలో ఉన్నట్లు గుర్తించిన హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. మరికొందరిపై నిఘా పెట్టారు. దీంతో తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ సరఫరా చేయ వద్దంటూ డ్రగ్స్ మాఫియాలో చర్చలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటంతో డార్క్‌నెట్‌పై కూడా పోలీసులు నిఘా పెంచారు. అయితే, డార్క్‌నెట్‌లోని వెబ్సైట్లలో ‘నో సేల్ ఫర్ తెలంగాణ పీపుల్’.. ‘నో సేల్ ఫర్ హైదరాబాద్ పీపుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హెచ్‌న్యూ ఆపరేషన్‌తో నేరుగా డ్రగ్స్ విక్రయించే వారితో పాటు డార్క్‌నెట్ వేదికగా విక్రయాలు సాగించే వారిలో కూడా భయం మొదలయ్యింది.
ప్రత్యక్షంగా.. పరోక్షంగా
హైదరాబాద్ నుంచి వచ్చే వారికి డ్రగ్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అందకుండా హెచ్‌న్యూ తీసుకున్న చర్యలు ఫలించాయి. గోవాలో డ్రగ్స్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తే వారి స్వస్థలం ఎక్కడా.. అని ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణ అని చెబితే పక్కకు తప్పుకుంటున్నారు. గతంలో డార్క్‌నెట్‌లో డ్రగ్స్ ఆర్డర్ తీసుకుంటూ, ఆర్డర్ ఇచ్చిన వారి చిరునామాకు కొరియర్లో పంపించారు. హెచ్‌న్యూ నిఘాలో ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో గోవా, రాజాస్థాన్కు చెందిన కొంతమంది డ్రగ్స్ విక్రేతలు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అప్పటి నుంచి డార్క్‌నెట్‌లో డ్రగ్స్ క్రయ, విక్రయాలకు సంబంధించిన వెబ్సైట్లలో నో సేల్ ఫర్ హైదరాబాద్, తెలంగాణ అంటూ మేసేజ్‌లు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చైన్ లింక్‌ను తెంచాలనే లక్ష్యంతో విక్రేతలు ఎంత దూరమున్న అక్కడికి వెళ్లి పట్టుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టడంతో ఇప్పుడు డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ వైపు చూడడానికి భయపడుతున్నది.