సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులుగా గ్రేటర్లో వాన దంచికొడుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు గంటన్నర సేపు కుండపోతగా కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి 7 గంటల వరకు రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 8.7సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గ్రేటర్‌పై ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.