సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు దేశంలో ఎవరూ లేరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. సోమవారం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
వినాయక చవితి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో 38 వేల గణపతి మండపాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పండుగ వేడుకలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యత అని, ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పండుగలను అడ్డం పెట్టుకొని మాట్లాడటం దుర్మార్గపు ఆలోచన అని మంత్రి మండిపడ్డారు. హిందువుల పండుగ.. అని అంటున్నారు.. మరి మేము ఎవరం.. అని మంత్రి ప్రశ్నించారు.
ఒక్క వినాయక చవితి, బోనాలే కాదు.. శ్రీ రామనవమి, బతుకమ్మ, ఉగాది.. అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పండుగలు చేయాలంటే ఎవరైనా చెప్పాలా.. ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. మూడు నెలల కిందటే వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
తప్పుడు ప్రచారాలతో నిర్వాహకులు ఆందోళనకు గురికావద్దని, నిమజ్జనాన్ని ఘనంగా, సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. సమైక్యతను చాటి చెప్పేందుకు స్వాతంత్య్ర ఉద్యమ సమయం నుంచే వినాయక చవితిని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రం రాకముందు ఏర్పాట్లు ఇలా లేవనే విషయం అందరికీ తెలుసునని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం మీద బురద చల్లేందుకే అనేక అవాస్తవాలను మాట్లాడారని మంత్రి తలసాని పేర్కొన్నారు.