సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): చెరువుల సుందరీకరణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే లంగర్‌హౌస్ చెరువును దత్తత తీసుకొని తక్కువ సమయంలో అభివృద్ధి చేసి.. స్థానిక ప్రజలను దుర్వాసన నుంచి విముక్తి చేశారు. అక్కడ హుడా పార్కును అభివృద్ధి చేసి ప్రజల నుంచి మన్ననలు పొందారు. తాజాగా.. శేరిలింగంపల్లి చందానగర్ సర్కిల్లోని ఈర్ల చెరువును సుందరీకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈర్ల చెరువు చుట్టూ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మేయర్ గుర్తించారు. వెంటనే ఈర్ల చెరువును దత్తత తీసుకొని పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ అభివృద్ధి, సుందరీకరణ పనులను పూర్తి చేయించారు. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా తొలుత గుర్రపు డెకను తొలగించారు. ఆ తర్వాత చెరువులోని పూటికతీత పనులను చేపట్టి.. నీటిని శుభ్రం చేశారు. అకడి ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించారు. పాదచారులకు, పిల్లలు ఆడుకునేందుకు గార్డెన్ పనులను చేపట్టి పర్యాటక కేంద్రంగా మలిచారు. ఈర్ల చెరువు ఆక్రమణకు గురికాకుండా అకడకడ పెన్సింగ్ పనులు కూడా చేపట్టారు. ఈర్ల చెరువు అభివృద్ధిలో భాగం పంచుకున్న జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ సుధాంశు, ఇంజినీరింగ్ విభాగం, ఎంటమాలజీ, యూబీడీ, శానిటేషన్ సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈర్ల చెరువు అభివృద్ధితోపాటు సుందరీకరణ పనులు చేపించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.