జీడిమెట్ల, సెప్టెంబర్ 5 : ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ మన్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన యెండ్లపల్లి రాజేందర్‌రెడ్డి(51) పీఏసీఎస్ డైరెక్టర్. కాగా రాజేందర్‌రెడ్డి తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ గాజులరామారంలోని మల్లారెడ్డినగర్‌లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం రాజేందర్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై షాపూర్‌నగర్ నుంచి గాజులరామారం వైపు వెళ్తున్నాడు. చిత్తారమ్మ ఆలయం వద్ద ఉన్న ఎంపీఆర్ కిచెన్ వద్దకు రాగానే పక్కనుంచి వెళ్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు రాజేందర్‌రెడ్డి నడుపుతున్న ద్విచక్ర వాహనం హ్యాండిల్‌ను తాకింది. దీంతో రాజేందర్‌రెడ్డి కింద పడటంతో అతని తల మీదుగా బస్సు వెనుక చక్రం వెళ్లింది. ఈప్రమాదంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.