మేడ్చల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ వృతి ఎంతో పవిత్రమైనదని వారు భగవంతుని స్వరూపులని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశకులుగా నిలిచి రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ను అందించాలన్నారు.
విద్యార్థుల భవితను తీర్చిదిద్ది, వారిని వారి గమ్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎనలేనిదని మంత్రి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 57 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారికి మంత్రి పురస్కారాలు అందించి పలువురికి సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఈవో విజయ కుమారి, జడ్పీటీసీలు అనితా, శైలజారెడ్డి, జవహర్‌నగర్ మేయర్ కావ్య, జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంతో మందిని తీర్చిదిద్దిన మహనీయుడు సర్వేపల్లి
కవాడిగూడ, సెస్టెంబర్ 5: సర్వేపల్లి రాధాకృష్ణన్ నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువు చెప్పిన గురువులను ప్రతి ఒక్కరు గౌరవించి పూజించాలని ఆమె పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ట్యాంక్‌బండ్ పైనున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్టు డైరెక్టర్ ఉమర్ జలీల్, హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి హాజరై పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య విలువైన సంబంధాలు కొనసాగాలని బోధించిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆమె అన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించారని గుర్తు చేశారు. నేటితరం ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆమె అభిలషించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సీకే శంకర్రావు, రమేశ్ రామ్, సురేశ్ ముదిరాజ్, శివకృష్ణ, వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కాటేపల్లి
హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 5: సమాజాభివృద్ధిలో గురువుల పాత్ర ఎంతో కీలకమని, రేపటి తరాన్ని తయారు చేసేది గురువేనని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనార్దన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఈ వృత్తిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలిచి ఎంతోమంది దేశానికి సేవలందించారని తెలిపారు.
దివంగత ఏపీజే అబ్దుల్ కలామ్ ఉపాధ్యాయ వృత్తి నుంచే భారత రాష్ట్రపతి వరకు ఎదిగారని, విద్య కోసం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తు చేశారు. సమాజంలో తల్లిదండ్రుల తరువాతి స్థానం ఉపాధ్యాయులదేనని, విజ్ఞాన ప్రపంచంలో దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని పేర్కొన్నారు. ముందుగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం, జిల్లా పరిధిలోని 80 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఆర్.రోహిణి, హిమాయత్ నగర్ జోన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి పాల్గొన్నారు.
పదవులకే వన్నె తెచ్చిన ప్రజ్ఞాశాలి డా.సర్వేపల్లి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించి దేశ ప్రథమ పౌరుడి వరకు ఎదిగి ఆయా పదవులకే వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని సుధీర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చే దిశగా యువతను ప్రొత్సహించారని పేర్కొన్నారు. గురువులను గౌరవించే ఈ రోజు ఎంతో గొప్పదని అన్నారు. రాధాకృష్ణన్ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, కార్పొరేటర్ పవన్ కుమార్, కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్, ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగాల నాగేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, జీవీ సాగర్‌రెడ్డి, తాళ్ల శ్రీశైలం గౌడ్, తోట శ్రీనివాస్ యాదవ్, మహిళా నాయకురాళ్లు రూపా సింగ్, విజయ గౌడ్, పద్మ , దీప్లాల్, ఇటిక్యాల యాదగిరి, బొగ్గారపు వరుణ్చంద్రతో పాటుగా పలువురు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి విరాళాలు
కొత్తపేట ప్రభుత్వోన్నత పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తన వంతుగా రూ.25 వేల నగదును అందజేస్తానని ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త రూ.25 వేలు, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త రూ.25 వేలు, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ రూ. 25 వేలు కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ రూ.20 వేలు, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి రూ.20 వేలు, కొత్తపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ గౌడ్ రూ.11 వేల నగదును విరాళంగా ప్రకటించారు.