సికింద్రాబాద్, సెప్టెంబర్ 5: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో టోల్ టాక్స్ వసూలును రద్దు చేయాలని పాలక మండలి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కొనసాగుతున్న పన్ను వసూళ్ల కారణంగా తమపై అదనపు భారం పడుతున్నదని, దీనిని నిలిపివేయాలని చాలా సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత ఇక్కడ అక్ట్రాయ్ పన్నును రద్దు చేసినప్పటికీ టోల్‌టాక్స్ వసూళ్లను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టోల్‌టాక్స్ రద్దు చేయాలని రక్షణ శాఖ డీజీ జూన్ 14న బోర్డుకు లేఖను పంపించారు. ఈ విషయమై గత నెల ఒకటో తేదీన జరిగిన సమావేశంలో చర్చలు జరిపిన పాలక మండలి బోర్డు ఆర్థిక పరిస్థితులు చితికిపోయి ఉన్నందున టోల్‌టాక్స్ వసూళ్లను రద్దు చేయడానికి విముఖత వ్యక్తం చేస్తూ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించి, డీజీ ఉత్తర్వుల మేరకు టోల్ టాక్స్‌ను రద్దు చేయాలని ఈ నెల 2వ తేదీన పీడీ పంపించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
దీంతో సోమవారం జరిగిన సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిపిన పాలక మండలి అక్టోబరు 31వ తేదీ అనంతరం, టోల్‌టాక్స్ వసూళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది.
అయితే, ప్రస్తుత కాంట్రాక్ట్ అక్టోబరు 31న ముగియనున్న నేపథ్యంలో నవంబరు నుంచి వసూళ్లను కొనసాగించేందుకు టెండర్లను ఆహ్వానించాలని ఆగస్టు 30న జారీ చేసిన సర్క్యులర్ ఎజెండా ప్రతిపాదనకు ఈ సమావేశంలో పాలక మండలి ఆమోద ముద్ర వేయడం కొసమెరుపు. బోర్డు ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే సాయన్న చెప్పారు.
పౌరుల తరపున నిలబడాలి
బ్రిగేడియర్ సోమ శంకర్
పౌరులపై భారాన్ని తగ్గించాలన్న సదుద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని బ్రిగేడియర్ సోమ శంకర్ పేర్కొన్నారు. పాలక మండలి ఓవైపు పౌరుల తరపున నిలబడటమే కాకుండా మరోవైపు టోల్‌టాక్స్ రద్దు వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునే దిశగా అడుగులు వేయాలని బ్రిగేడియర్ సూచించారు.