దుండిగల్, సెప్టెంబర్ 3: బీటెక్ మొదటి సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థుల ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల్లో మైక్రో ప్రాజెక్ట్ ఆలోచనలను రేకెత్తించడానికి ఇటీవల ‘ఇన్నోవేషన్ చాలెంజ్-2022’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేసిన విద్యార్థులకు శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులకు రియల్ లైఫ్ అప్లికేషన్లలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన ఇంక్యూబేషన్ను అందిస్తున్నామని, విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఎంఎల్ఆర్ఐటీలో మార్కెట్ చేయదగిన ఉత్పత్తులు, స్టార్టప్‌ల దిశగా విద్యార్థులు ఆవిష్కరణలు చేసేందుకు ప్రత్యేక ఫెసిలిటీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఐఈ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ డీన్ డాక్టర్ రాధికాదేవితో పాటు ఆయా విభాగాల అధిపతులు డా.అచ్చిరెడ్డి, డా.మహేంద్ర, ఫెసిలిటేటర్ మాధురి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.