సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసభ్యంగా ప్రవర్తించిన పూజారి.. తోటి ఉద్యోగిని వేధించిన బ్యాంక్ మేనేజర్.. వక్రబుద్ధి చూపిన స్కూల్ టీచర్.. ఇలా వివిధ రకాలుగా అతివలను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తుల ఆకట్టించింది సైబరాబాద్ షీటీమ్స్. ఆగస్టు నెలలో మొత్తం 128 ఫిర్యాదులు రాగా, అందులో అత్యధికంగా 102 ఫిర్యాదులు వాట్సాప్, నేరుగా 13, ట్విట్టర్ ద్వారా 1, ఈ-మెయిల్ – 3, ఉమెన్ సేఫ్టీ వింగ్ – 8 చొప్పున ఫిర్యాదులు అందినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మొత్తం 47 కేసులు నమోదవ్వగా, అందులో 10 క్రిమినల్, మిగిలిన 37 పెట్టీ కేసులు ఉన్నాయి. కమిషనరేట్ పరిధిలోని రద్దీ బస్టాప్‌లు, షాపింగ్‌మాల్స్, రైల్వేస్టేషన్లు, ట్యుటోరియల్స్, కళాశాలలు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన డెకాయి ఆపరేషన్ల ద్వారా 18 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని.. వారిలో 8మందిపై పెట్టీ కేసులు నమోదు చేసినట్లు షీటీమ్స్ అధికారులు తెలిపారు. మిగిలిన వారిని కౌన్సెలింగ్‌కు తరలించినట్లు చెప్పారు.
గుడికి వెళ్లిన మహిళను వేధిస్తూ….
మాదాపూర్‌కు చెందిన మహిళ తన స్నేహితురాలితో కలిసి ప్రతిరోజు స్థానిక దేవాలయానికి వెళ్తుండేది. ఆలయ పూజారి నుదుటిపై బొట్టు పెడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా, ఆ పూజారిపై కేసు నమోదు చేశారు.
క్లబ్ హౌస్ యాప్ ద్వారా…
క్లబ్ హౌస్ యాప్‌ను వినియోగిస్తున్న యువతికి వసంత్ సందీప్(31) పరిచయమయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీనిని ఆసరాగా చేసుకుని గతంలో చేసిన చాటింగ్ సందేశాలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ సదరు యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా, నిందితుడిపై కేసు నమోదు చేశారు.
వేధిస్తుంటే..
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగిని అదే బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న జి. నవీన్(48) అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. విషయం పై అధికారులకు చెప్పడంతో ఆమెను వేరే శాఖకు బదిలీ చేశారు. అయినా నవీన్ వేధింపులు ఆగలేదు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోన్ అడిగి…
బీహెచ్ఈఎల్ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వ్యక్తి తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, అత్యవసరంగా తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని వేడుకున్నాడు. నమ్మిన సదరు మహిళ అతడికి మొబైల్ ఇవ్వడంతో తన ఫోన్‌కు కాల్ చేసి, ఆమె నంబర్ తెలుసుకున్నాడు. ప్రతిరోజు ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా, నిందితుడు మహ్మద్ రిజ్వాన్(22)గా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో రాపిడో బుక్ చేసుకున్న మహిళను డ్రైవర్ ప్రతిరోజు తాగిన మత్తులో అసభ్యకర పదజాలంతో వేధిస్తుండంతో షీటీమ్స్ అదుపులోకి తీసుకుంది.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కు గురయ్యే మహిళలు, యువతులు, విద్యార్థినులు నిర్భయంగా షీటీమ్స్‌ను ఆశ్రయించాలని లేదా డయల్ 100 లేదా sheteam.cyberabad@gmail.com, twitter: Women and children Safety Wing Cyberabad ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సూచించారు.