సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ) : నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరానికి వందేండ్లదాకా తాగునీటికి ఢోకా ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్… దానికి అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనే హైదరాబాద్‌కు 30 టీఎంసీల గోదావరిజలాల కేటాయింపు ఉండగా… ఇటు కృష్ణాజలాల్లోనూ 33 టీఎంసీల నీటి తరలింపునకు మార్గం సుగమం చేశారు. సుంకిశాల పథకం ద్వారా నగరానికి కృష్ణాజలాల తరలింపునకు శాశ్వత పరిష్కారాన్ని చూపిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం తరలించే పరిమాణానికి రెట్టింపు స్థాయిలో కృష్ణాజలాల్ని తరలించేలా బలమైన పునాది వేశారు. ఇందులో భాగంగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుంకిశాల పథకం ద్వారా 33 టీఎంసీల జలాల తరలింపునకు ఆమోదం తెలుపడం శుభ పరిణామం.
ఒకప్పుడు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడే హైదరాబాద్ మహా నగరం ఇప్పుడు దేశంలోని ఏ మెట్రో నగరానికి కూడా లేని తాగునీటి భరోసాతో నిశ్చింతగా ఉంది. రానున్న వందేండ్ల వరకు నగరవాసులకు తాగునీటి ఇబ్బంది అనేది తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా కోదండాపురం నీటిశుద్ధి కేంద్రానికి కృష్ణాజలాల్ని తరలించి… అక్కడి నుంచి నాలుగు దశల్లో శుద్ధి చేసి నగరవాసులకు తాగునీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల (ఏడాదికి 16.5 టీఎంసీలు) కృష్ణాజలాలు నగరవాసులకు అందుతున్నాయి. అయితే ఇది కేవలం నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే సాధ్యమయ్యే ప్రక్రియ. అందుకే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సుంకిశాల పథకాన్ని చేపట్టింది. రూ.1450 కోట్లతో నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద సాగర్ బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇక్కడ సాగర్ జలాశయ నీటిమట్టం 465 అడుగుల వరకు ఉంటుంది. ఈ పథకం పూర్తయితే నేరుగా కృష్ణానది నుంచి జలాల్ని 18 కిలోమీటర్ల దూరంలోని కోదండాపురం నీటి శుద్ధి కేంద్రానికి తరలించడం వల్ల ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు సంబంధం లేకుండా ఉంటుంది.
మెరుగైన పాలన కోసం…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోద్ర ముద్ర వేసింది. జీహెచ్ఎంసీలో ప్రసుత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, ఆ సంఖ్యను 15కు పెంచారు. ఇతర కార్పొరేషన్ల వారి సంఖ్యను 5 నుంచి 10 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.
సుంకిశాల విస్తరణ…
హైదరాబాద్ నగరానికి గతంలోనే 30 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు జరిగింది. ఇప్పటివరకు కృష్ణాజలాల్లో ఏడాదికి 16.5 టీఎంసీల కేటాయింపు మాత్రమే ఉంది. సుంకిశాల పథకంలో ప్రస్తుతం 16.5 టీఎంసీల జలాల తరలింపునకుగాను పనులు జరుగుతున్నాయి. ఇందులో అదనంగా మరో 16.5 టీఎంసీల తరలింపునకుగాను సివిల్ పనులు కూడా చేపడుతున్నట్లు తెలిసింది. 33 టీఎంసీల తరలింపునకు అనుగుణంగా పైపులైన్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో నీటి తరలింపును పెంచాలనుకుంటే కేవలం మోటార్లను అమర్చుకుంటే సరిపోతుంది. తద్వారా ప్రస్తుతానికి రెట్టింపు స్థాయిలో అంటే 33 టీఎంసీల మేర కృష్ణాజలాల్ని నగరానికి తరలించుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే సుంకిశాల పథకాన్ని మెరుగుపరిచేందుకుగాను రూ. 2,214.73 కోట్లకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.