సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు (ఔటర్)ను హెచ్ఎండీఏ లీజుకు ఇవ్వనుంది. ఔటర్ రింగు రోడ్డు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌ను టీవోటీ (టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విషయంలో హెచ్ఎండీఏ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం ఓఆర్ఆర్ టోల్ వసూళ్ల ద్వారా ప్రతియేటా రూ.421 కోట్లు వస్తున్నాయి. ఒకేసారి 20- 25 ఏండ్ల పాటు ఓఆర్ఆర్ను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడంతో భారీ మొత్తంలో ఒకేసారి నిధులు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వడంతో దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల మొత్తం ఒకేసారి హెచ్ఎండీఏకు సమకూరే అవకాశం ఉంది.
ఇందులో భాగంగానే దీర్ఘకాలిక లీజు అంశాన్ని నిర్ణయించేందుకు లావాదేవీల సలహాదారు ను నియామకం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 21 లోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ప్రీ బిడ్ మీటింగ్ ఈనెల 5 తేదీన నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు టెక్నికల్ బిడ్స్ తెరుస్తుండగా, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత బిడ్డర్లకు తెలియజేస్తారు. బిడ్స్ చెల్లుబాటు 120 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలోనే బిడ్డర్లు పూర్తి స్థాయి నివేదికను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది.
బీవోటీ తరహాలో టీఓటీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులను (బిల్ట్, ట్రాన్స్ఫర్, ఆపరేటర్) విధానంలో చేపడుతుంటాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని, నిర్వహణ సైతం విజయవంతంగా కొనసాగుతున్న ఓఆర్ఆర్ ప్రాజెక్టును టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో చేపట్టేందుకు ఆసక్తి ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయించారు. ఈ విధానంలో ఓఆర్ఆర్ లీజుకు తీసుకొని నిర్ధేశిత కాలపరిమితికి సంబంధించిన మొత్తాన్ని ముందుగానే హెచ్ఎండీఏకు చెల్లించి, టోల్ వసూలుతో పాటు నిర్వహణను ఎంపిక చేసిన సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు దక్కించకున్న సంబంధిత సంస్థకు ఔటర్ లీజు ప్రతిపాదన 20 ఏండ్లు ఇవ్వాలా..? లేదంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాలా..? అని నిర్ధారించనున్నారు. అంతేకాదు.. లీజుకు సంవత్సరాలు.. టోల్ వసూళ్లు, పెరుగుదలను సమగ్రంగా వివరించడం, కచ్చితమైన టోల్ సమాచారం అందించడం, లీజు వల్ల సంస్థకు కలిగే లాభనష్టాలు, కాంట్రాక్టర్‌కు చేకూరే ఆదాయం, నిర్వహణ వ్యయం లాంటి అంచనాల నివేదికను సదరు ఎజెన్సీ హెచ్ఎండీఏకు అందజేయనున్నది. సదరు ఎజెన్సీ ఇచ్చే సూచనల నివేదిక ఆధారంగా ఏ పద్ధతిన లీజుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయించనున్నది.
ఒకేసారి వచ్చే నిధులతో ఔటర్ చుట్టూ మరింత అభివృద్ధి..
గ్రేటర్ చుట్టూ రూ.6,696 కోట్లు ఖర్చుపెట్టి ఎనిమిది లేన్లతో 158 కిలో మీటర్లు ఔటర్ రింగు రోడ్డు మార్గానికి శ్రీకారం చుట్టింది. 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్న ఓఆర్ఆర్పై ప్రతిరోజు 1.75 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజు రూ.1.16 కోట్లు, నెలకు రూ.35 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 421 కోట్ల వరకు టోల్ రూపంలో ఆదాయం వస్తున్నది. ఇది గత వార్షిక సంవత్సరం అంటే 2021-22లో వచ్చిన ఆదాయం. దీనికి అనుగుణంగా ప్రతియేటా వాహనాల సంఖ్య పెరగడంతో ఈ ఆదాయం కూడా పెరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే 20- 25 ఏండ్ల కాలానికి వసూలయ్యే మొత్తాన్ని ఒకేసారి చెల్లించి లీజుకు తీసుకునే సంస్థలకు ఓఆర్ఆర్ను టీవోటీ విధానంలో అప్పగించనున్నారు. ఇలా వచ్చే భారీ నిధులను ముందే ఎజెన్సీ నుంచి తీసుకుని ఆ నిధులను ఇతర అభివృద్ధి పనులను వెచ్చించనున్నారు. దాదాపు రూ. 5 వేల కోట్ల మేర వస్తాయని, ఆపరేషన్స్, మెయింటనెన్స్ బాధ్యతలు ఆ ఎజెన్సీ చూసుకొని, ఎంత లాభం వచ్చినా తీసుకునే వెసులుబాటు వారికే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.