బేగంపేట, సెప్టెంబర్ 2: ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీతో శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రూ.45 కోట్లతో బేగంపేట నాలా అభివృద్ధి పనులను చేపట్టగా.. బ్రాహ్మణవాడిలో జరుగుతున్న పనులను, ఎస్ఎన్డీపీ ద్వారా పికెట్ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్‌రెడ్డి, జలమండలి ఈఎన్సీ కృష్ణ, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నాలాల్లో పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాకు ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలా పరిసరాల్లోని అన్ని కాలనీల్లో సివరేజీ స్ట్రాం వాటర్ లైన్లను ఏర్పాటు చేయాలని, రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నాలా వరద నీటి ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, ప్రభుత్వానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఎస్ఎన్డీపీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని నాలాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలను చేపట్టిందని చెప్పారు. పికెట్ నాలాపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఒకవైపు ఇప్పటికే పూర్తయి రాకపోకలు సాగుతున్నాయని, రెండో వైపు పనులు కూడా మరో 15 రోజుల్లో పూర్తి కానున్నాయని చెప్పారు.
పికెట్ నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదతో సమీపంలోని రసూల్‌పుర బస్తీ, అన్నానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ కాలనీ, సౌజన్యకాలనీ, బోయినపల్లి తదితర ప్రాంతాల ప్రజలు వరదనీటి ముంపునకు గురవుతుంటారని, బ్రిడ్జి నిర్మాణంతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులు 6 నెలల్లో పూర్తవుతాయని, పనులు పూర్తయితే బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, అల్లంతోట బావి, మాతాజీనగర్ తదితర ప్రాంతాల ప్రజలకు వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, డీసీ ముకుందరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శేఖర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.