మేడిపల్లి పోలీసులు పీర్జాదిగూడ, సెప్టంబర్ 2: అదృశ్యమైన తల్లి కూతుళ్లు, ఓ బాలుడి ఆచూకీని గుర్తించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు మేడిపల్లి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సింగోజు నాగాచారి కార్పెంటర్‌గా పనిచేసుకుంటూ.. తన భార్య స్వాతి (33) ఇద్దరు కూతుళ్లు సాహిత్య(16), వైష్ణవి (11 నెలల పాప)లతో కలిసి బోడుప్పల్ వివేకానందనగర్‌కాలనీలో ఉంటున్నారు. గత నెల 30న ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. నాగాచారి పనికి వెళ్లగానే స్వాతి ఇంటికి తాళం వేసి కూతుళ్లతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి భర్త మేడిపల్లి పోలీసు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా వారు యాదగిరిగుట్టలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వెళ్లి.. తల్లీబిడ్డలను తీసుకొచ్చి.. కుటుంబసభ్యలకు అప్పగించారు. మరో ఘటనలో మేడిపల్లి కమాలానగర్ కాలనీకి చెందిన యాట సంజయ్ కుమారుడు సృతిక్ జయంత్(12) ఓ ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. 1న ఉదయం రోజూ మాదిరిగానే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం రాత్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు నిజామాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి..తల్లిదండ్రులకు అప్పగించారు.