మియాపూర్, సెప్టెంబర్ 2 : అభివృద్ధి పనులలో వేగం పెంచాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అవసరమున్న చోట కొత్త పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. మియాపూర్, చందానగర్ డివిజన్లలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరెడ్డి సహా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులలో అలసత్వం సహించబోమన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా పెండింగ్ రహదారుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని గాంధీ సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వసతుల కల్పన కోసం తాను ప్రతినిత్యం కృషి చేస్తున్నట్లు అధికారులు సైతం తగు వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, ఏఈలు శివప్రసాద్, ప్రశాంత్ పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో పేదలకు అండగా సీఎం సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. బాధితులలోనూ కొండంత భరోసా నెలకొంటున్నదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన బాధితులకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ.9.01,500 ఆర్థిక సాయం నిధులను చెక్కుల రూపంలో విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురయ్యే పేద ప్రజలు సీఎం సహాయనిధి ద్వారా కార్పొరేట్ వైద్యంతో తమ ఆరోగ్యాలకు స్వస్థత పొందుతున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంలా పథకం ఉపయోగపడుతున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రకాంత్‌రావు, శ్రీను, రవీందర్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్, శిరీష పాల్గొన్నారు.