శంషాబాద్ రూరల్, ఆగస్టు 28: జాబ్‌మేళాతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్ ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహించారు. మొత్తంగా 6906 మంది నిరుద్యోగులు హాజరు కాగా 2011 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అంతేకాక ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని వివరించారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉపాధి లభించడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ జాబ్‌మేళాలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు,ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, వైస్ ఎంపీపీ నీలం మోహన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సహకారంతో ఉద్యోగం వచ్చింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నేను బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. ఇప్పటి వరకు 10 వేల జీతంతో పని చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగా, నాకు రూ. 30 వేల జీతం రావడం సంతోషకరంగా ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా నియమక పత్రాన్ని తీసుకోవడం ఆనందంగా ఉంది.