రవీంద్రభారతి,ఆగస్టు 28: తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు నటించిన పౌరాణిక, జానపద, సామాజిక చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కళా దర్బార్ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన తెలుగుతేజం నందమూరి తారాక రామారావు అని చెప్పారు.
సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి గొప్ప రాజకీయవేత్తగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. అలాంటి మహానుభావుడి పేరిట పురస్కారాలు అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ సినీనటుడు మురళీమోహన్, ప్రముఖ నటి రోజారమణిలకు ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళా దర్బార్ వ్యవస్థాపకుడు పుత్తూరి రంగారావు, పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు గాయనీగాయకులు ఎన్టీఆర్ నటించిన చిత్రాల పాటలు ఆలపించి అందరిని అబ్బురపరిచారు.