బంజారాహిల్స్,ఆగస్టు 28: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పాటు ప్రమాదకరమైన రంగులతో తయారు చేసిన గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని పార్కులు, చౌరస్తాలవద్ద ఆదివారం మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని జలగం వెంగళరావుపార్కు, కేబీఆర్ పార్కు, ఫిలింనగర్ బస్తీలలో కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను అందజేస్తున్నారు. సర్కిల్ 18 పరిధిలో సుమారు 8వేలకు పైగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు.