సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీసీ విద్యార్థుల కోసం గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలతో పాటు ప్రభుత్వ స్కూల్ టీచర్ పోస్టులు, గురుకుల టీచర్ పోస్టుల కోసం సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 వరకు గడువు విధించినట్లు తెలిపారు. అయితే, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలన్నారు. అలాగే, ప్రభుత్వ స్కూల్ టీచర్ ఉద్యోగాల కోసం (డీఎస్సీ) కోచింగ్ తీసుకోవాల్సిన వారు బీఈడీ పూర్తి చేయడంతో పాటు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం 040-24071178, 27077929లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి www.tsbcstudycircle. cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.