సిటీబ్యూరో,జూలై 2 (నమస్తే తెలంగాణ): నగర చరిత్రలోనే కలికితురాయిగా నిలిచే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా – ఈ రేసింగ్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. తాజాగా ఫార్ములా -ఈ రేసింగ్ కోసం రాష్ట్ర సచివాలయం ఎదురుగా, హుస్సేన్‌సాగర్ తీరంలో ఉన్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ రూట్లోని 2.37 కి.మీ పొడవైన మార్గాన్ని ఎంపిక చేశారు. సైఫాబాద్ నుంచి వచ్చే మార్గంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు, అక్కడి నుంచి తిరిగి లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్ వైపు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకొని.. బీఆర్కేఆర్ భవన్ నుంచి సైఫాబాద్ వైపు సచివాలయం దక్షిణ వైపు వరకు మార్గాన్ని ప్రాథమికంగా నిర్ణయించారు.
8 మలుపులు… 3 సెక్టార్లుగా..
ఫార్ములా -ఈ కార్ రేసింగ్‌లో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఈ పోటీల్లో వినియోగిస్తారు. ముందుగా నిర్ణయించిన 2.37 కి.మీ ట్రాక్‌లో విద్యుత్ కార్లు 280 కి.మీ వేగంతో పరుగులు పెడతాయి. మొత్తం 28 చోట్ల మార్షల్ పొజిషన్స్, ఫైర్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ట్రాక్‌ను 3 సెక్టార్స్‌గా విభజించారు. దీనిపై 8 చోట్ల రేసింగ్‌లో పాల్గొన్న కార్లు మలుపులు తీసుకొని గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఫార్ములా -ఈ కార్ల రేసింగ్ ప్రారంభం తెలంగాణ సచివాలయం ఎదురుగా (లుంబినీ పార్కు ఉత్తరం వైపు) ప్రారంభమై, తిరిగి అదే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. 2.37 కి.మీ పొడవునా ఉండే ట్రాక్‌ను డ్రైవెన్ ఇంటర్నేషనల్ డిజైన్ చేస్తోంది.
ఫిబ్రవరి 11న నిర్వహణ…
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఫార్ములా -ఈ రేసింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నిర్వహించనున్నారు. ఇది హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్‌గా చెప్పవచ్చు. గతంలో 2013లో దేశంలోని బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఎఫ్1(ఫార్ములా వన్) రేసింగ్ పోటీలు జరిగాయి. తాజాగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తున్న ఫార్ములా -ఈ రేసింగ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం పూర్తి కానుండగా, దీంతో పాటు లుంబినీపార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను ఆధునీకరించేందుకు ల్యాండ్ స్కేపింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ట్రాక్‌కు ఎంతో ప్రాధాన్యత నెలకొన్నది.