సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/మియాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి ;సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన టీహబ్-2 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి సీఎం కేసీఆర్ భవనంలోని వసతులు, టెకీలకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించారు. పదులసంఖ్యలో సాంకేతిక పరికరాలతో కూడిన ప్రదర్శనలను టెకీలు ఆసక్తిగా తిలకించారు. తమ స్టార్టప్‌ల ఆలోచన సరళి, కృషిని తోటి స్టార్టప్‌ల నిర్వాహకులతో పంచుకున్నారు. తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తొలిరోజు 32 కంపెనీల సెషన్స్ సాగగా, ఆయా కంపెనీల నిర్వాహకులు తమ జయాపజయాలను పంచు కున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నీతానై వ్యవహరించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన అతిథులకు తెలంగాణ వంటకాలతో చక్కటి ఆతిథ్యం ఇచ్చారు.
ఐటీ ఇలాకా మురిసిపోయింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరాగా సందడిగా మారింది. ఆలోచనలను పంచుకొని.. అద్భుతాల ఆవిష్కరణకు వేదికైన టీ హబ్ 2.0ను మంగళవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అవి పని చేసే విధానాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన ఈ వేడుకలకు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారు.
సామాన్యుడిలా మంత్రి కేటీఆర్
టీ హబ్ వేడుకల్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకార్షణగా మారారు. సామాన్యుడిలా టీ హబ్ ప్రాంగణమంతా కలియదిరిగారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రతి స్టాల్ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు యువతీయువకులు పోటీ పడ్డారు.
32 సెషన్లు..
తొలి రోజు టీ హబ్ 2.0లో సుమారు 32 కంపెనీలు తమ సెషన్స్‌ను కొనసాగించాయి. ముఖ్యంగా స్విగ్గీ, మై షో సహా ఇతర ప్రముఖ కంపెనీలు ఈ సెషన్స్‌లో పాల్గొన్నాయి. తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు జయాపజయాలను ఇతరులతో పంచుకున్నాయి.
యువత సందడి..
టీ హబ్ 2.0 ప్రారంభోత్సవ వేడుకకు యువత భారీగా హాజరైంది. స్టార్టప్ కంపెనీలతో పాటు ఐటీ ఉద్యోగులు తరలివచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. టీ హబ్ ప్రాంగణమంతా కలియదిరుగుతూ తోటి స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను పరిచయం చేసుకుంటూ తమ ఆలోచనలను పంచుకున్నారు.
యువతరం ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చు
యువతరానికి సరికొత్త తరంగమైన ప్రముఖ యూ ట్యూబర్ తన్మయ్ భట్ టీ హబ్‌లో సందడి చేశాడు. తన విజయాల పరంపరను యువతకు వివరించాడు. “నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో యువతరం ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చు. యువతరం ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. ఇందుకనుగుణంగా ఏది చేసినా అది ట్రెండ్ సెట్టర్‌గా మారే అవకాశం ఉంది. సరదా కోసం నేను చేస్తున్న యూ ట్యూబ్ వీడియోలకు వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనం.” అని సూచించారు. అంతకు ముందుకు మంత్రి కేటీఆర్‌తో తన్మయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. స్టార్టప్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి యువతరానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చేలా ఉందని కొనియాడారు.
అలరించిన లలిత్ లైవ్
టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ‘లలిత్ లైవ్’ పేరుతో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. సితారా, ఫ్లూట్, వయోలిన్, తబలా, గిటార్ , ప్యాడ్ ప్లేయర్ లాంటి సంగీత పరికరాలతో వాయిద్యకారులు సుస్వరాలను పంచారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ వేడుకలు సందర్శకులను ఎంతగానో రంజింపజేశాయి.
టీ హబ్ ఓ మంచి వేదిక
స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలను కొనసాగించాలంటే రకరకాల సాంకేతికత, వివిధ రంగాల నిపుణుల అవసరం తప్పనిసరి. స్టార్టప్‌లకు అవసరమైన వారందరినీ కలిపేందుకు టీ హబ్ ఓ మంచి వేదిక. మాలాంటి ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులకు ఇది రైట్ ప్లేస్. టీ హబ్ ద్వారా స్టార్టప్‌ల కార్యకలాపాలను విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది.
–సూర్యతేజ, ట్రిపుల్ ఐటీ విద్యార్థి
ప్రభుత్వ ప్రోత్సాహంతో గొప్ప ప్రచారం
7 సంవత్సరాల క్రితం మీషో స్టార్టప్ ప్రారంభించినప్పుడు మా తల్లిదండ్రులకు సైతం ఎలాంటి అవగాహన లేదు. కానీ నేడు ప్రభుత్వాల ప్రోత్సాహంతో స్టార్టప్‌ల మీద ప్రచారంతోపాటు సరైన అవగాహన వస్తున్నది. నా సహచరుడు సంజీవ్‌తో కలిసి 2015లో ప్రారంభించిన మా సంస్థ చిన్న వ్యాపారాలు చేసేవారికి ఆన్లైన్లో మంచి అవకాశాలను కల్పిస్తున్నది. ప్రస్తుతం 2100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 12 నెలల్లో 100 మిలియన్ల వినియోగదారులకు సేవలందించాం.
-విధిత్ ఆత్రేయ్, మీషో సీఈవో
అదృష్టం మాత్రమే సరిపోదు
స్టార్టప్‌లు ప్రారంభించినప్పుడు అందులో కష్టనష్టాలు సర్వసాధారణం. వాటిని తట్టుకొని, సమస్యలను అధిగమిస్తూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తేనే వ్యాపార మనుగడ సాధ్యమవుతుంది. స్టార్టప్ నిలబడాలంటే అదృష్టం ఉంటే సరిపోదు, ఆలోచనలకు తగిన శ్రమ ఉండాలి. అర్బన్ లాజిస్టిక్స్ రంగంలో స్విగ్గీని ప్రారంభించాము. మూడేండ్ల్ల వరకు ఫుడ్ కంపెనీగా మార్చాలా? డెలివరీ కంపెనీగా తీర్చిదిద్దాలా? అనే నిర్ణయానికి రాలేకపోయాం. స్విగ్గీ స్టోర్స్‌లో మేం ఫెయిల్ అయ్యాం. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మీద తీవ్రంగా శ్రమిస్తున్నాం. రెస్టారెంట్ రంగంలో చిన్న వ్యాపారాలు ప్రారంభించిన ఎంతో మంది స్విగ్గీ ద్వారా లాభపడుతున్నారు.
-శ్రీహర్ష మాజెట్టి, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు
ఎత్తుపల్లాలను తట్టుకోవాలి
భారతదేశంలో క్రీడా రంగంలో అద్భుత అవకాశాలున్నాయి. వాటిని గుర్తించి డ్రీమ్ 11 పేరిట ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్టార్టప్ ఫండింగ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే సక్సెస్ అవుతాం. క్రీడారంగంలో వ్యాపారానికి మనదేశంలో మంచి అవకాశాలున్నాయి. ప్రపంచంలో రెండో ఖరీదైన ప్రసార హక్కులుగా ఐపీఎల్ నిలిచిన విషయం అందరికీ తెలుసు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి 2008లో డ్రీమ్11ను ప్రారంభించాం. డ్రీమ్ 11 భారతదేశంలో మొదటి గేమింగ్ కంపెనీ యూనికార్న్‌గా నిలిచింది. హైదరాబాద్ నగరం టెక్నాలజీ హబ్‌గా నిలుస్తున్నది. త్వరలో నగరంలో డ్రీమ్11 కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం.
-హర్ష్ జైన్, డ్రీమ్ 11 సీఈవో
ఏకలవ్యుడిలా సంకల్పించుకోవాలి
ప్రపంచంలోని పనితనమంతా పురాణాల్లోనే పేర్కొన్నారు. ఏకలవ్యుడిలా పట్టుదలతో స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తున్నది. రామాయణం, మహాభారతం చదవడం వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏమిచేయాలో, ఏది ప్రారంభించాలో, ఏమి సాధించాలో తెలుస్తుంది. విద్యా విధానంలో ఉన్న మూసధోరణిని గుర్తించి దాని మార్పు కోసం లీడ్‌ను ప్రారంభించాం. మా సంస్థ నేడు 1.4 మిలియన్ల విద్యార్థులకు చేరువైంది. దాదాపు 3500 పాఠశాలల పరిధిలోని 50 వేల మంది ఉపాధ్యాయులతో అనుసంధానమయ్యాం. విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచేలా మా కార్యకలాపాలు ఉంటాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఫలితాలు రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో చూడబోతున్నాం.
–సుమిత్ మెహతా, లీడ్స్ కో ఫౌండర్, సీఈవో
కేటీఆర్ ముందుచూపుతో..
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలతో రాణిస్తాయి. ఒకే ప్రాంగణంలో ఇంత పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ కలిగిన భవనం టీహబ్ 2.0. కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన స్టార్టప్‌లు, యూనికార్న్ కంపెనీలు, యువ పారిశ్రామిక వేత్తలు ఇందులో కార్యాలయాలను ఏర్పాటుచేసుకోవడం సంతోషకరం. స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నది. ముఖ్యంగా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ముందుచూపుతో ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకొంటున్నారు.
–శ్రీనివాస్ కొల్లిపార, స్టార్టప్ వెంచర్స్ గ్రూపు అధ్యక్షుడు
వెరైటీ రుచులు..
పసందైన వంటకాలతో టీ హబ్ ప్రాంగణం ఘుమఘుమలాడింది. కమ్మనైన, రుచికరమైన శాకాహారంతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు.
హీరో రానా సందడి
టీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా సినీ హీరో రానా కీలకోపన్యాసం చేశారు. స్టార్టప్ నిర్వాహకులకు ఉత్సాహం నింపేలా తన ప్రసంగం కొనసాగించారు. దేశంలోనే స్టార్టప్‌లు హైదరాబాద్ వైపు చూసేలా టీ హబ్‌ను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆలోచనలు, ఆవిష్కరణకు ఇక్కడ ప్రాణం పోయవచ్చని వివరించారు.