సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): వర్షా కాలం కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నది. భారీ వర్షాలకు ఏర్పడిన వరదలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నగరంలోని ప్రమా దకరమైన మైనర్, మేజర్ నాలాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముంద స్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అకడ ప్రమాదాలు జరగకుండా ఒకో అధికారిని నియమించారు. వీటితో పాటు హెచ్చరిక బోర్డులతో పాటు మెష్(జాలీల)ను ఏర్పాటు చేశారు. అయితే నగరంలో 314 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అందుకు అనుగుణంగా 337 మంది అధికారుల నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు.
జోనల్ వారీగా భద్రతా చర్యలు
ఎల్బీ నగర్ జోన్లో నాలాలకు సంబంధించి 74 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పర్యవేక్షణ కోసం76 మంది అధికారులను నియమించారు. చార్మినార్ జోన్ లో 52 ప్రాంతాలలో 32 మంది అధికారులను, ఖైరతాబాద్ జోన్లో 85 ప్రాంతాలలో 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్లో 52 ప్రాంతాలలో 52 మంది అధికారులను, కూకట్పల్లి జోన్లో 48 ప్రాంతాలలో 49 మందిని, సికింద్రాబాద్ జోన్లో 55 సమస్యాత్మక ప్రాంతాల్లో 79 మంది అధికారులను నియమించారు. కాగా, వివిధ ప్రాజెక్టుల వద్ద 18 మంది అధికారులను నియమించారు.
పని నిరంతరంగా కొనసాగించేందుకు నీరును తొలగించడం, అవసరమైన కూలీలను, ఇసుకను సిద్ధం చేసుకోవడం, పని జరిగే చోట ప్రమాదాలు సంభవించకుండా బ్యారి కేడింగ్, హెచ్చరిక బోర్డులు, విద్యుత్ కాంతుల డెకరేషన్‌కు సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న 36 ప్రదేశాలలో భద్రతా చర్యలు చేపట్టారు ఇందుకు 18 మంది అధికారులను నియమించారు. నిరంతరం పని కొనసాగించేందుకు అవసరమైన ప్రధాన సామగ్రిని ఏర్పాటు చేస్తారు. చెరువుల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా185 చెరువులకు 19 మంది అధికారులను నియమించారు. వర్షాలు కురిసే సందర్భంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.