హయత్‌నగర్, జూన్ 19: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించే బాధ్యత వారి పిల్లలదేనని, కన్నవారిని పట్టించుకోకపోతే కటకటాల పాలవుతారని జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ అన్నారు. ఆదివారం హయత్‌నగర్ డివిజన్ రాఘవేంద్రనగర్ సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో ఆర్. నర్సయ్య అధ్యక్షతన ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ అవగాహనపై 24 సంఘాల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ కుటుంబంలో మంచి ప్రేమనురాగాలు ఉండేలా చూసుకోవాలని, పిల్లలకు, యువతకు అవగాహన సదస్సులు నిర్వహించి వారి బాధ్యతలను తెలియజేయాలన్నారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తానని, డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్స్ భవనాలు నిర్మించడానికి తనవంతు కృషిచేస్తానని హామీనిచ్చారు. అనంతరం ఆర్.నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం 2007 చట్టంలోని ప్రతిఅంశాన్నీ నెరవేర్చాలని, సీనియర్ సిటిజన్స్ సంఘాలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఆసరా ఉపాధ్యక్షులు యాదిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, టాస్మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, కాలనీ అధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, శేఖర్‌రెడ్డి, కార్యదర్శి కైలాసనాథ్, హరినాథ్‌బాబు, బుచ్చిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.