కొండాపూర్, జూన్ 15 : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాపిరెడ్డి కాలనీలో నివాసముండే బాలిక పదో తరగతి చదువుతున్నది. ఆ ప్రాంతంలోనే ఉండే అరవింద్ (21) ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలిక వెంటపడుతూ ప్రేమించాలని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ట్యూషన్, స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వేధిస్తున్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 2 తెల్లవారుజామున తన ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఎవరో తగలబెట్టినట్లు కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, బైక్ తగలబెట్టింది అరవిందేనన్న అనుమానంతో అతడిపై స్థానికుల సహాయంతో కొందరు దాడి చేసి గాయపరిచారు.
మరోవైపు లైంగిక వేధింపుల కేసు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన అరవింద్ తనపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి దిగారంటూ ఫిర్యాదు చేశాడు. బైక్ తగలబెట్టింది తాను కాదంటున్నా.. వినిపించుకోకుండా స్థానికులతో కలిసి తీవ్రంగా దాడి చేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి కుటుంబసభ్యులు బుధవారం చందానగర్ పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఇదిలా ఉంటే అరవింద్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపారు. నిందితుడిపై 354, 354డీ, 506,509, 11 అండ్ 12 పోక్సో, బైక్ తగలబెట్టినందుకు 435 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
చిన్నారితో అసభ్య ప్రవర్తన
సికింద్రాబాద్, జూన్ 15: దుకాణానికి వచ్చిన బాలిక పట్ల వ్యాపారి అసభ్యంగా ప్రవర్తించాడు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌ఖుష్‌నగర్‌కు చెందిన మహబూబ్ బాషా(60) కిరాణా దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఈనెల 11న స్థానికంగా నివసించే నాలుగో తరగతి బాలిక(8) మహబూబ్ బాషా దుకాణానికి రాగా, అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి..దర్యాప్తు చేపట్టారు.