మేడ్చల్ రూరల్, జూన్ 10: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, ఏ గ్రామాన్ని చూసినా పచ్చదనంతో కళకళలాడుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని సైదోనిగడ్డ తండా, ఎల్లపేంట, కోనాయిపల్లి, నూతన్‌కల్, రాయిలాపూర్ గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. రాయిలాపూర్, సైదోనిగడ్డ తండాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభంతో పాటు దాదాపు రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 12770 గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామంలో గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, పారిశుధ్య పనుల నిర్వహణకు ట్రాక్టర్ కల్గి ఉన్నాయన్నారు. ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఏ వృద్ధురాలి కన్నా కన్న కొడుకు నెలకు రూ.2వేలు ఇస్తున్నారా? అని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక అన్నగా, కొడుకు ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ దగుల్బాజీ పార్టీలు..
బీజేపీ, కాంగ్రెస్‌లు దగుల్బాజీ పార్టీలు, ప్రజలను మోసం చేయడం తప్ప ఏమి రాదని మంత్రి మల్లారెడ్డి దుయ్యబట్టారు. దేశంలో ఉన్న 28 రాష్ర్ర్టాలను తలదన్నేలా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుంటే కుల, మత రాజకీయాలతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తిట్టడమే పనిగా పెట్టుకొని, లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కానీ, పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చుపెడితే ప్రజలే తరిమితరిమి కొడతారని, బీజేపీ, కాంగ్రెస్ ఖబడ్దార్ అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, వైస్ ఎంపీపీ గోపని వెంకటేశ్, సర్పంచ్‌లు సుజాత కిషన్ నాయక్, గోప గణేశ్, గుంటి శేఖర్, కవితా జీవన్, కరుణాకర్‌రెడ్డి, నర్మదాగోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు కుమార్ యాదవ్, ప్రకాశ్, ఆశా సుల్తానా, రుక్సానా బేగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, జడ్పీ సీఈవో దేవ సహాయం, తహసీల్దారు గీత, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో వినూత్న రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, విజయానందారెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజాహరినాథ్, సుదర్శన్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.