సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ) : నేరగాళ్ల కార్యకలాపాలను నియంత్రించేందుకు నేర చరిత్ర కలిగిన వారిని బైండోవర్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ హోదాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కౌన్సెలింగ్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న వారిని 107/122 సీఆర్పీసీ కింద విచారణ జరిపి వారి వద్ద నుంచి సత్ప్రవర్తనతో ఉంటామని హామీ ఇస్తూ ఇద్దరి సంతకాలతో రూ.50 వేల బాండ్‌ను తీసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఏడాది పాటు జైలుకు పంపిస్తామని సీపీ స్పష్టం హెచ్చరించారు. రాజేంద్రనగర్, పహాడీషరీఫ్, శామీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలోని నేరస్తులకు సీపీ కౌన్సెలింగ్ ఇచ్చి వారిని బైండోవర్ చేశారు. ఈ సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఏసీపీ రవిచంద్ర, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.