సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, బీజేపీ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా తీసుకురావడం చేతకాదని, ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం కాలంలో నిర్మించిన నాలాలను అభివృద్ధి చేయాలని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా.. ? అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద నగరంలోని నాలాల్లో పూడిక తొలగింపు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు.
ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తొలుత గోల్నాక డివిజన్ పరిధిలోని కృష్ణానగర్‌లో మొకలను నాటారు. అనంతరం స్థానికంగా ఉన్న నాలాల్లో పూడిక తొలగించే పనులను మంత్రి పరిశీలించారు. నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బస్తీలో డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి..
ప్రజలు ఎదురొంటున్న సమస్యలను పరిషరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. పల్లెలు, పట్టణాల్లోని సమస్యలను పరిషరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మొకలు నాటుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం ..
గాంధీనగర్ డివిజన్లోని అరుంధతీ నగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి తలసాని, అధికారులు పాల్గొన్నారు. స్థానిక నాలాను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బస్తీలో సీసీ రోడ్లు నిర్మించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాలా వెంట ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరగా, స్థలం వివాదం కోర్టులో ఉన్నదని, సమస్యను పరిషరించి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అని మంత్రి తెలిపారు. దీంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలను మన బస్తీ – మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.