శామీర్‌పేట/పీర్జాదిగూడ, జూన్ 4 : స్వచ్ఛ మున్సిపాలిటీలే పట్టణ ప్రగతి లక్ష్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ, పీర్జాదిగూడలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూకుంటలో చైర్మన్ రాజేశ్వర్‌రావుతో కలిసి రూ.5 కోట్లతో వాటర్ పైపులైన్, ఓపెన్ జిమ్, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, తెలంగాణ క్రీడాప్రాంగణానికి భూమి పూజ చేశారు. పీర్జాదిగూడ 4వ డివిజన్లో మేయర్ జక్క వెంకట్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు, అధికారులు మున్సిపాలిటీలను నందనవనాలుగా తీర్చిదిద్దాలన్నారు. పర్వతాపూర్ రామ్‌నగర్ కాలనీలోని మైసమ్మ, వెంకటచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్ స్వాతి కృష్ణగౌడ్ పాల్గొని పూజలు చేశారు. వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు రాజ్కుమార్యాదవ్, నర్సింగ్రావుగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు షఫీఉల్లాబేగ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, డీఈ సునీత పాల్గొన్నారు.
స్వచ్ఛతే లక్ష్యం..
మేడ్చల్ జోన్ బృందం : పట్టణ ప్రగతి రెండో రోజు ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ వార్డులు, డివిజన్లలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యాన్ని పరిశీలించారు. సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.