సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రాచుర్యం పొందిన క్రీడల్లో క్రీడాకారులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. క్రీడల్లో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు పట్టణ ప్రగతిలో భాగంగా క్రీడా మైదానాలు (స్పోర్ట్స్ గ్రౌండ్) నెలకొల్పాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగరంలోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులు కల్పించి క్రీడాకారుల్లో నైపుణ్యతను పెంచేందుకు ఇప్పటికే కోచ్‌లను నియమించింది. ఇటీవల 6 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న వారికి 44 ఈవెంట్స్‌లో 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. వారిని జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేలా తయారు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన కొందరు క్రీడాకారులు జీహెచ్ఎంసీ అందించిన ప్రోత్సాహంతో వివిధ క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విషయం తెలిసిందే.
450 క్రీడా ప్రాంగణాలు..
తెలంగాణ అర్బన్ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్దేశం మేరకు జనాదరణ, ప్రాచుర్యం పొందిన సంప్రదాయ క్రీడలు ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మొత్తం 450 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఎకరం.. లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాళీ స్థలంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో వార్డుకు ప్రత్యేకాధికారిని నియవిస్తూ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సుదూరంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. ఓ వేళ స్థలం లేని పక్షంలో అదేవార్డుకు ఆనుకొని ఉన్న ఇతర వార్డులోని స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
వచ్చే ఏడాదికల్లా..
ప్రభుత్వం నిర్దేశించిన క్రీడలైన ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, లాంగ్ జంప్ కిట్, రెండుప్యారలల్, సింగిల్ ఎక్సర్ సైజ్ బార్‌కు కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఆయా క్రీడలకు కావాల్సిన స్థలాన్ని ప్రత్యేకంగా నిర్దేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 521 క్రీడా మైదానాలు ఉన్నాయి. అదనంగా మరో 158 నూతన క్రీడా మైదానాలను డిప్యూటీ కమిషనర్లు తాజాగా గుర్తించారు. సంవత్సర కాలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రీడా ప్రాంగణాల చుట్టూ సింగిల్ వరుసలో వేప, బౌహినియ, గల్మోహర్, సిసూ, కానుగ, బాదం, తంగేడు, చింత, వెదురు నాటనున్నారు. నాటిన మొక్కలను కాపాడే బాధ్యతను వార్డు అధికారులు తీసుకోనున్నారు.