సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): అర్హత ఉండి పోలీసు ఉద్యోగం సాధించాలనే తపన ఉన్న వారికి నగర పోలీసు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులలో చేరేందుకు మరోసారి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ చేరే అభ్యర్థులకు పోలీసు శాఖ తరపున ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని పోలీసు శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా నగర పోలీసు అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా మరోసారి అర్హులైన వారికి శిక్షణలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో, జాయింట్ సీపీ (అడ్మిన్) రమేష్ పర్యవేక్షణలో ఐదు జోనల్ డీసీపీల నేతృత్వంలో కొనసాగుతున్న ఈ ఉచిత శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే వారు వచ్చే నెల 2వ తేదీలోపు ఆయా జోనల్ అధికారులను సంప్రదించాలని, ఉచిత శిక్షణ సమన్వయాధికారి అదనపు డీసీపీ మధుకర్ స్వామి వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఆ సమయంలోనే మరోసారి శిక్షణలో చేరే అభ్యర్థులకు అవకాశమిస్తామని చెప్పారు. అందులో భాగంగానే తాజాగా ఉచిత శిక్షణలో చేరి ఉద్యోగం సాధించాలనుకునే వారి కోసం నగర పోలీసు కమిషనర్ మరో అవకాశాన్ని కల్పించారు. అర్హత ఉన్నవాళ్లు ఆయా జోనల్లోని అధికారులను సంప్రదించాలని అదనపు డీసీపీ మధుకర్ స్వామి తెలిపారు.