మల్కాజిగిరి, మే 27: మల్కాజిగిరి బార్ అసోషియేషన్ అడ్వకేట్ల సమస్యలు పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి కోర్టు భవనాలకు మల్కాజిగిరిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అడ్వకేట్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు జిల్లా కోర్టులు ఎల్బీనగర్లో ఉండేవని అన్నారు. ప్రతి రోజూ కేసులకోసం మల్కాజిగిరి నుంచి ఎల్బీనగర్కు అడ్వకేట్లు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారని అన్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా కోర్టులలో కొన్నింటిని మల్కాజిగిరి సర్కిల్ వాజ్‌పేయినగర్‌లోని ప్రభుత్వ భవనాలకు తరలించడంతో అడ్వకేట్లకు కొంత ఉపశమనం దొరికిందని అన్నారు.
మరో సారి ఇక్కడి కోర్టులను తిరిగి మరో చోటికి తరలించడానికి జరిగి ప్రయత్నాన్ని అడ్వకేట్లు ఉమ్మడిగా వ్యతిరేకించడంతో వాటిని ఉపసంహరించుకోవడం హర్షణీయమని అన్నారు. ఇక్కడ ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనాలు నిర్మించే వరకు వాయుపురిలోని అద్దె భవనంలో కోర్టులు పనిచేస్తున్నాయని అన్నా రు. కోర్టు భవనానికి ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నారని, ఇక్క డ ఉన్న ప్రభుత్వ స్థలానికి కోర్టు భవనాలకు కేటాయించాలని చేసిన ప్రయత్నంలో అడ్వకేట్ల పాత్ర కీలకమైనదని అన్నారు. అడ్వకేట్లు ఉమ్మడిగా నాదగ్గరకు రావడంతో ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్నామని అన్నారు. కోర్టు భవనాలకు స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు రామచంద్రరెడ్డి, రాజుయాదవ్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్ పాల్గొన్నారు.
క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
నేరేడ్మెట్ , మే 27 : నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్త సుధ భర్త గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే స్పందించి తనవంతు బాధ్యతగా బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1 లక్ష ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటూ ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, జయప్రకాశ్, మహాత్యవర్ధన్, నర్సింహులు, సుధ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.