ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కాను తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.5 లక్షల విలువైన గుట్కా, కారును స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకున్నది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండల కేంద్రంలోని ఓఆర్ఆర్ సమీపంలో బీదర్ నుంచి వరంగల్‌కు నిషేధిత గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై శివకృష్ణ, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. కాగా మరో వ్యక్తి మారుతిని అదుపులోకి తీసుకున్నారు. కారులో 30 బ్యాగుల నిషేధిత గుట్కా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన గోపాల్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు గోపాల్, రాజశేఖర్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.