పెద్దఅంబర్‌పేట, మే 21; ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది.అంతా ఒక్కటిగా ఎలా ముందుకు సాగాలో నేర్పుతుంది. ఒక్కోచేయి తోడైతే కష్టాలను ఎలా ఎదుర్కోవచ్చో బోధిస్తుంది.. గెలువాలన్న కసిని రగిలిస్తుంది.. నలుగురితో ఎలా మెలగాలో తెలియజేస్తుంది.. అందుకే సెలవులు వస్తే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు పలువురు. గ్రామంలోని అందరినీ ఒక్కచోటకు చేరుస్తున్నారు. పార్టీలు, కులాలకతీతంగా మైదానంలోకి తీసుకొస్తున్నారు. స్పాన్సర్లను పట్టి.. ఆధునికతను జోడించి పోటీలు నిర్వహిస్తూ .. ఔరా అనిపిస్తున్నారు.
ఐపీఎల్ వచ్చాక.. జిల్లావ్యాప్తంగా సెలవుల్లో ఇదే తరహాలో పోటీల నిర్వహణకు యువజన సంఘాలు, యువకులు ముందుకొస్తున్నారు. గ్రామాల పేర్లు వచ్చేలా లీగ్‌లకు పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు.. టీపీఎల్ అంటే తారామతిపేట ప్రీమియర్ లీగ్ అని, క్యూపీఎల్ అంటే కుత్బుల్లాపూర్ ప్రీమియర్ లీగ్ అంటూ నామకరణాలు చేస్తున్నారు. ఒక ఊరిని చూసి మరో ఊరు, ఒక కాలనీని చూసి మరో కాలనీ ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నాయి. సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నాయి. కొన్ని ఊర్లు.. తమ గ్రామంలోనే పలు జట్లను తయారు చేస్తున్నాయి. వాటిలోనే ప్రతి జట్టు బలంగా ఉండేలా చేసి పోటీ పెడుతున్నాయి. మరికొన్ని గ్రామాలు ఇతర గ్రామాల నుంచి జట్లను కూడా పోటీలకు ఆహ్వానిస్తున్నాయి.
ఊర్ల మధ్య సైతం ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నగర శివారులోని పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీపట్నం మున్సిపాలిటీలతోపాటు ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం డివిజన్లలోనూ ఈ తరహా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేలా యువతలో ఆసక్తి పెంచుతున్నారు. ఇందుకోసం మైదానాల వద్ద సకల వసతులు కల్పిస్తున్నారు. ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. పలువురు వాట్సాప్, ఇన్‌స్టా తదితర సోషల్‌మీడియా వేదికల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌండ్ బాక్సులతో గ్రౌండ్ దద్దరిల్లేలా చేస్తున్నారు. మైకులతో వ్యాఖ్యానాలు చేస్తూ ఉత్సాహపరుస్తున్నారు.
ఆట కోసం కలిసి కట్టుగా..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తారామతిపేట గ్రామం మాది. మా ఊరు చాలా పెద్దది. గ్రామంలో చాలామంది యువత క్రీడలపై ఆసక్తితో ఉన్నది. అందుకే కొంతమందిమి కలిసి తారామతిపేట ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించాలని భావించాం. అందుకు తగ్గట్టే ప్రజాప్రతినిధులను కలిసి మా నిర్ణయాన్ని వివరించాం. అందరూ ఒకే చెప్పారు. అంతేకాదు.. వివిధ వసతులు కల్పించేందుకు స్పాన్సర్లుగా ముందుకొచ్చారు. ఇంకేముంది జట్ల సభ్యులందరికీ వారి వారి పేర్లతో టీషర్టులు వచ్చాయి. క్రికెట్ కిట్లు అందజేశారు. ఆరేండ్లుగా ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాం. వారాంతంలో పోటీలు పెడుతుంటాం. ఊర్లో ఆరు జట్లున్నాయి. పిల్లల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు ఉపయోగపడుతాయని అనుకుంటున్నాం.
చిన్న (రమేశ్), ఏవీకే, సతీశ్, శ్రీకాంత్, రాకేశ్, యోగి ఇలా పదిమందిమి కలిసి పోటీలు నిర్వహిస్తున్నాం. కేవలం గ్రామంలోని యువత మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని పెట్టుకున్నాం. ఎలాంటి గొడవలకు తావులేకుండా, ఉత్సాహంగా ఆటలను ఆస్వాదిస్తున్నాం. ప్రథమ బహుమతిగా అరలక్ష వరకు నగదు ప్రకటించడంతో లీగ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
– బీ శివరాం, తారామతిపేట గ్రామం,అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
అందరి సహకారంతో పోటీలు..
పోటీలు గెలువాలన్న కలిసి నేర్పుతాయి. ఇది జీవితంలో ఉన్నతికి చేరేందుకు ఉపయోగపడుతుంది. కొంతమందితో కలిసి గ్రామంలో ఏటా పోటీలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం మా పరిధిలోని ఆరుగురు కౌన్సిలర్లు ముందుకొస్తున్నారు. స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఏటా మూడ్రోజులపాటు పోటీలు పెడుతున్నాం. ఆ సమయంలో ఊరంతా ఒక్కచోటకు చేరుతారు. ఇప్పటివరకు ఆరుసార్లు కుంట్లూర్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాం. అందరితో కలిసిపోయి జట్లను విభజిస్తాం. ఆటగాళ్లకు అన్ని వసతులు కల్పిస్తాం. గతంలో వివిధ కాలేజీల నుంచి 55 టీంలతో పోటీలు పెట్టాం. ప్రస్తుతం కేవలం గ్రామం వరకే పోటీలు పెడుతున్నాం. యువతలో ఇవి పోటీ తత్వాన్ని పెంచుతాయి. కలిసి ఎలా ముందుకు వెళ్లాలో నేర్పుతాయి. మేం కొందరం కలిసి అందరి సహకారంతో ఏటా పోటీలు నిర్వహిస్తున్నాం.
– పర్వతి కరుణాకర్‌రెడ్డి, కుంట్లూర్,పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ
ఉత్సాహం నింపేలా..
క్రీడా పోటీలు యువకుల్లో ఉత్సాహం నింపుతాయి. ఊర్లో ఎన్ని పార్టీలు ఉన్నా.. పోటీల సమయంలో ఐక్యతగా ఉంటాం. గతంలో ఎంతోమంది క్రీడాకారులు ఉండేవారు. అందరినీ మళ్లీ ఒక్కటి చేసి.. ఆటలపై ఆసక్తి పెంచేందుకు ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాను. క్రికెట్‌పై ఆసక్తి ఉండి.. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఇందులో చేరాలని సూచించాం. చాలామంది ఆడేందుకు ముందుకొచ్చారు. అందరి పేర్లు సేకరించాం. స్పాన్సర్లుగా వ్యవహరించాలని గ్రామ ప్రజాప్రతినిధులను కోరాం. వారు అంగీకరించారు. టీంల వారీగా విభజన చేశాం. టీంలోని ప్రతి ఆటగాడికి.. అతని పేరు, టీం పేరు ప్రత్యేకంగా ముద్రించిన టీషర్టులు అందజేశాం. దీంతో యువత మరింత ఆసక్తిగా పోటీల్లో పాల్గొన్నది. ఒక్కో స్పాన్సర్ ఒక్కో వసతి కల్పించారు. ఒకరు గ్రౌండ్‌కు అయ్యే మొత్తాన్ని చెల్లిస్తే.. మరొకరు పిల్లలకు ఆహారాన్ని అందజేశారు. ఇంకొకరు టీషర్టులు, మరొకరు క్రికెట్ కిట్లు ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రీమియర్ లీగ్ (క్యూపీఎల్) పేరుతో నిర్వహించిన పోటీల్లో 8 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు షీల్డ్‌లు, నగదు బహుమతులు కూడా ఇచ్చాం.
– నిరంజన్, కుత్బుల్లాపూర్ గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
చర్చించుకుని ముందుకు..
మా గ్రామంలో మంచి క్రీడాకారులు ఉన్నారు. ఎలాగైనా గౌరెల్లి ప్రీమియర్ లీగ్ (జీపీఎల్) పేరిట పోటీలు నిర్వహించాలని మా స్నేహితులతో కలిసి చర్చించాం. పాత జట్ల సభ్యులతో మాట్లాడాం. మళ్లీ పోటీలు పెడితే బాగుంటుందని భావించాం. ప్రజాప్రతినిధులను కలిసి విషయాన్ని చెప్పాం. వారు అంగీకరించారు. స్పాన్సర్లుగా ముందుకొచ్చారు. టీషర్టులు, క్రికెట్ కిట్లు ఇప్పించారు. ఐదేండ్ల కిందట వరకు రెగ్యులర్‌గా పలు క్రీడా పోటీలు నిర్వహించాం. విజేతలకు షీల్డ్‌లు అందజేశాం. ఆటలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయి.
– గ్యార అంజి, గౌరెల్లి, టోర్నీ నిర్వాహకుడు