సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం పెంపు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన పౌర సేవల కల్పన ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ‘పట్టణ ప్రగతి’ని నిర్వహించ తలపెట్టింది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. మోడల్ మార్కెట్లు, పార్కులు, డంప్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, అర్బన్ లంగ్‌స్పేస్, ఓపెన్ జిమ్స్ లాంటి సౌకర్యాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
రోడ్ల పక్క చెత్త, పిచ్చి మొక్కలు, మట్టి దిబ్బల తొలగింపు, మురుగునీటి కాలువల శుభ్రం, ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు , పబ్లిక్ స్థలాల శుభ్రం, పాడుబడిన భవనాల తొలగింపు, పాడుబడిన బోర్లు, బావుల పూడ్చివేత, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి తగు చర్యలు చేపట్టనున్నారు. శ్మశానవాటికలు, సమీకృత మార్కెట్లు, పార్కులు, ఆటస్థలాలు, డంపింగ్‌యార్డులు, మానవవ్యర్థాల శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఖాళీ స్థలాలను గుర్తించనున్నారు. అవెన్యూ ప్లాంటేషన్, నాటిన మొక్కలు 85 శాతం బతికించేలా చూడటంతో పాటు పట్టణ వీధి వ్యాపారులకు జోన్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోనున్నారు. 15 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ బృహత్ కార్యక్రమంలో పౌరులను భాగస్వామ్యం చేయనున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో విధిగా పాల్గొని లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యం..
గ్రేటర్లో మరింత పచ్చదనం పెంపునకు ‘పట్టణ ప్రగతి’లో అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గడిచిన ఐదేళ్లలో నాటిన మొక్కలు, నాటిన ప్రాంతాలను పరిశీలించడం, చెట్లు పెరగడానికి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగింపు, చెట్ల చుట్టూ మట్టిని సరిచేయడం, వీడింగ్, ట్రీ గార్డులను ఏర్పాటు చేయనున్నారు. కాలనీల్లోని పార్కులను సందర్శించి అక్కడ పరిశుభ్రతా చర్యలు చేపట్టనున్నారు. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటడం, అన్నీ నర్సరీల్లో 100 శాతం మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పార్కులను ఏర్పాటు చేయగా.. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా కొమ్మలు కత్తిరించనున్నారు.
గతంలో చేపట్టిన పనులు..
ఎత్తిన చెత : 28983.8 మెట్రిక్ టన్నులు
తొలగించిన నిర్మాణ వ్యర్థాలు : 15632.5 మెట్రిక్ టన్నులు
పిచ్చి చెట్లు : 2501.71 కిలోమీటర్లు
నాలాల్లో తీసిన పూడిక : 206.07 కిలోమీటర్ల విస్తీర్ణం
కూల్చిన శిథిల, పురాతన భవనాలు : 140
నీరు నిల్వకుండా చేసిన ప్రాంతాలు : 105
నివాస సముదాయాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ : 94502
క్లీనింగ్ చేసిన ఓహెచ్ఎస్ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్‌లు : 31
శుభ్రపరిచిన పార్కులు : 636
శుభ్రం చేసిన విద్యా, ప్రార్థనాలయాలు : 1441
క్లీనింగ్ చేసిన పబ్లిక్ టాయిలెట్లు : 3424
శుభ్రపరిచిన శ్మశానాలు, గ్రేవీయార్డులు : 465