సిటీబ్యూరో,మే 17 (నమస్తే తెలంగాణ) : ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ తెలంగాణ ముందుంటుంది. నగరాల్లోనే కాదు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని వినియోగించుకోవడం లో దిట్ట. రాష్ట్రంలో పలువురు రైతులు రెండేళ్లుగా డ్రోన్స్ ను వినియోగిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ విష యం తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మం త్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం తెలంగాణకు చెందిన ముగ్గురు రైతులు, హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ స్టార్టప్ వ్యవస్థాపకులతో వర్చువల్ వేదికగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవచ్చనేది ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కిసాన్ డ్రోన్స్ పేరుతో వ్యవసాయ రంగంలో డ్రోన్స్‌ను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు మారుత్ డ్రోన్స్ స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రేమ్ తెలిపారు. ఇటీవల నీతి ఆయోగ్‌లో నిర్వహించిన డ్రోన్స్ కార్యక్రమంలోనూ తాము పాల్గొని, మంత్రితో సమావేశమై డ్రోన్ టెక్నాలజీని ఏయే రంగాల్లో వినియోగిస్తున్నామని వివరించామని ఆయన చెప్పారు.